కీచక తండ్రి : మూడేళ్లుగా కన్న కూతురిపై లైంగిక దాడి..
గత మూడేళ్లుగా తన కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ, ఆమెను చిత్రహింసలకు గురిచేస్తున్న 46 ఏళ్ల వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
విశాఖపట్నం : విశాఖపట్నంలోని జీవీఎంసీ పరిధిలో అమానుష ఘటన వెలుగు చూసింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కన్న కూతురిపై మూడేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ విషయం తల్లికి తెలిసినా ఎదిరించలేదు. దీంతో ఆ కీచక తండ్రి మూడేళ్లుగా అఘాయిత్యానికి పాల్పడుతూనే ఉన్నాడు. ఇక ఏ మాత్రం సహించలేకపోయిన ఆ యువతి తల్లితో కలిసి పోలీసులను ఆశ్రయించడంతో ఈ వికృత చేష్టలు వెలుగు చూసాయి.
విశాఖపట్నంలోని జీవీఎంసీ 61 వార్డు మల్కాపురం సమీపంలో ఉన్న ఇండస్ట్రియల్ కాలనీలో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. ఈ కాలనీలో హనుమంత శివ అనే వ్యక్తి కొంతకాలంగా భార్య, కొడుకు, కూతురితో కలిసి కాపురం ఉంటున్నాడు. కూతురు డిగ్రీ చదువుకుంటుంది. గురువారం నాడు ఆ తండ్రి ఆమెను గాజువాకలోని ఓ కోచింగ్ సెంటర్లో పరీక్షకు తీసుకెళ్తున్నానని ఇంట్లో చెప్పి బైక్ పై తీసుకు వెళ్ళాడు.
నేరుగా ఓ లాడ్జికి తీసుకువెళ్లాడు. అక్కడ ఓ రూమ్ బుక్ చేసి ఆమె మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తరువాత ఇంటికి తీసుకువచ్చాడు. తల్లిని చూడగానే కన్నీరు మున్నీరవుతూ ఆ యువతి తండ్రి చేసిన ఘాతుకాన్ని చెప్పింది. ఈ విషయాన్ని చుట్టుపక్కల వారు కూడా విన్నారు. వెంటనే వారు స్పందించారు. దీంతో గత మూడేళ్లుగా తన మీద చేస్తున్న అరాచకాన్ని ఆ యువతి వారికి చెప్పింది.
తండ్రి చేసే దారుణానికి ఎదురు తిరిగినా, ప్రశ్నించినా.. తనను, తల్లిని తీవ్రంగా కొడుతున్నాడని చెప్పి భోరుమంది. ఎక్కువ, తక్కువ మాట్లాడితే ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తానని.. దిక్కులేని వారు అవుతారని బెదిరించాడని తెలిపింది. ఇది విన్న స్థానికులు తీవ్ర అగ్రహ వేషాలకు లోనయ్యారు. గురువారం సాయంత్రం తల్లి, బాధిత యువతి స్థానికుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీస్ స్టేషన్లో తన తండ్రి గత మూడేళ్లుగా తనమీద చేస్తున్న అఘాయిత్యాలను, వికృత చేష్టలను చెప్పుకొని యువతి విపరీతంగా రోధించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సీఐ జీడి బాబు విచారణ ప్రారంభించారు. వైద్య పరీక్షల నిమిత్తం బాధిత యువతిని కేజీహెచ్ కు తరలించారు. నిందితుడు శివను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.