అనారోగ్యంతో బాధపడుతున్న కొడుకు బాధ చూడలేక ఓ తండ్రి.. తన కొడుకును తన చేతులతోనే చంపేసి... ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హృదయవిదారక సంఘటన కృష్ణా జిల్లా నున్న రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. 

పూర్తి వివరాల్లోకి వెళితే... ప్రకాశ్ నగర్ కి చెందిన కూల్ డ్రింక్ వ్యాపారి విష్ణుమూర్తి(40)కి వివాహమై.. ఒక కొడుకు, కూతురు ఉన్నారు. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న వీరి కుమారుడు హరిమణికంఠ సాయికుమార్(22) గత రెండేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. అతని శరీరంలో రక్త ప్రసరణ ఆగిపోయిందని వైద్యులు తెలిపారు.

ఎన్ని ఆస్పత్రులు తిరిగినా లాభం లేకుండా పోయింది. వైద్యం కోసం చేసిన అప్పు మాత్రం రూ.20లక్షలు అయ్యింది. కొడుకు పడుతున్న బాధను చూసి తట్టుకోలేక.. భార్య, కూతురు ఇంట్లో లేని సమయంలో కొడుకుకి ఉరి వేసి చంపేశాడు. అనంతరం అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి ముందు వైద్యం కోసం చేసిన అప్పలన్నింటినీ తీర్చేయడం గమనార్హం.

భర్త, కొడుకుల మృత దేహాలను చూసి విష్ణుమూర్తి భార్య బోరున విలపించింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.