దారి తప్పుతున్న కొడుకును సరిదిద్దే బాధ్యత తండ్రిది. కొడుకు సరిదిద్దే క్రమంలో తండ్రి తిట్టాడనే, కొట్టాడనే ఆవేశపడితే... జీవితాలు నాశనం అవ్వడం తప్ప మరేమీ మిగలదు. అందుకు ఉదాహరణే ఈ సంఘటన. మద్యానికి బానిసౌతున్న కొడుకును తండ్రి మందలించాడు. తండ్రి మాటలకు బాధపడిన ఆ కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ కొడుకును కాపాడే క్రమంలో తండ్రి కూడా ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ విషాదకర సంఘటన కృష్ణా జిల్లా నూజివీడు మండలం లీలానగర్ అడ్డరోడ్డులో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...చిత్తపూర్‌కు చెందిన మంతెన ఇస్మాయిల్‌(48)కి ఇరువురు కుమారులు. వీరిలో చిన్న కుమారుడు మంతెన వెంకటేశ్వరరావు(25) మద్యానికి బానిసై జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో తాగుడు మాన్పించాలనే లక్ష్యంతో ఇస్మాయిల్‌ కుటుంబం రెండు నెలల క్రితం నూజివీడు మండలం లీలానగర్‌ అడ్డరోడ్డు వద్ద ఉన్న చర్చి వద్దకు వచ్చి ఉంటూ అక్కడే పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నారు.

కాగా వెంకటేశ్వరరావు మాత్రం తాగుడు మానలేదు.  ఈ విషయంలో తండ్రి, కొడుకుల మధ్య వివాదం చోటుచేసుకుంది. తండ్రి తిట్టాడనే కోపంతో.. వెంకటేశ్వరరావు... ట్రాన్స్ ఫార్మర్ పట్టుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొడుకును కాపాడేందుకు వెళ్లిన ఇస్మాయిల్ తీవ్రగాయాలపాలయ్యాడు. ఆస్పత్రికి తరలించగా... ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. పోలీసులు కేసు నమోదు  చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.