స్టీల్ ప్లాంటు  మాకు చావు బతుకుల సమస్య. సాధించేదాకా ఉద్యమం సాగుతుంది. ఉధృతమవుతుంది

 రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రాయలసీమ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు ఏర్పడేందుకు కడప జిల్లాలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని స్టీల్ ప్లాంట్ సాధన సమితి నాయకుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి చేస్తున్న నిరవధిక నిరాహార దీక్ష నేడు రెండో రోజుకు చేరింది.

 ఆ ఫ్యాక్టరీ సాధనకు ప్రాణ త్యాగానికైనా సిద్ధమేనని, ఈవిషయంలో వెనకడుగు వేసేది లేదని ప్రవీణ్‌కు స్పష్టం చేశారు.

ప్రొద్దుటూరు శివాలయం సెంటర్‌లో బుధవారం నాడు ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. గతంలో స్టీల్ ప్లాంట్ఏర్పాటు విషయమై 90 రోజులలో ప్రభుత్వం స్పష్టమయన ప్రకటన చేయకపోతే, ఆమరణనిరాహార దీక్ష చేస్తానని ఆయన ప్రకటించారు. ప్రభుత్వం నుంచి ఆశించిన స్పందన లేకపోవడంతో ఇపుడాయన ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. గురువారం నాడు దీక్షా శిబిరం నుంచి ‘ఏషియానెట్’ తో ఫోన్ లో మాట్లాడారు.

 “శ్రీబాగ్‌ ఒడంబడిక రావలసిన రాజధానిని రాయలసీమ, విభజన బిల్లులో ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రత్యేక ప్యాకేజీనీ కోల్పోయింది. ఇప్పుడు ఉక్కు పరిశ్రమ స్థాపనలోనూ అన్యాయం ,నిర్లక్ష్యం కనిపిస్తున్నాయి. ఇది ఇలా కొనసాగనీమయం,” అని ఆయన అన్నారు.

జిల్లాకు స్టీల్‌ ప్లాంట్‌ను సాధించుకోవడానికి ఎంతకయినా తెగిస్తామని చెబుతూ వలసలు ఆగాలన్నా, కరవు రూపుమాపడానికి, ఈప్రాంతంలో చదువుకున్న వారికి ఉద్యోగాలు రావడానికి స్టీల్ ప్లాంటు అవసరం. ఇది మాకు చావు బతుకుల సమస్య. సాధించేదాకా ఉద్యమం సాగుతూంది. ఇంకా ఉధృతమవుతుంది,” అని ప్రవీణ్ చెప్పారు.

‘‘గతంలో విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అని నినదించి ప్రాణాలిచ్చింది సీమ బిడ్డలే. ఇపుడు కడప ఉక్కురాకపోతే మౌనంగా ఉంటారని ప్రభుత్వాలు భావిస్తున్నయి. ఇది దురదృష్టం,” అని అన్నారు. 

నిన్న, ఈ రోజు పట్టణంలోని అనేక కుల సంఘాలు, వర్తక వాణిజ్యసంఘాలు,ప్రజాస్వామిక సంస్థలు ఆయనకు మద్దతు తెలిపాయి. మంగళవారం నాడు పొద్దుటూరులో పేరుమోసిన చేనేత జనాభా తరఫున వద్దినరసింహులు ప్రవీణ్ కు మద్దతు తెలిపారు. ఉక్కు ఫ్యాక్టరీ వచ్చే దాకా పోరాడేందుకు ప్రొద్దుటూరు ప్రజలు సిద్ధంగా ఉన్నారని నరసింహులు కూడా చెప్పారు.

స్టీల్ ప్లాంటు సాధన సమితి డిమాండ్లు ఇది:


1) విభజన చట్ట్టంలో పేర్కొన్న ఉక్కు కర్మాగారం స్థాపన చర్యలను తక్షణమే చేపట్టాలి. ప్రారంభ తేదీని ప్రకటించాలి. 


2) కడప స్టీలు ప్లాంటును ఇటు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చినా, కేంద్రం ఇచ్చినా ఒక్కటే.

3) స్టీల్‌ ప్లాంటుతోపాటూ రాయలసీమలో మైనింగ్‌ రీసెర్చ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి 


4) సీమ ప్రాంతంలోని ఆర్‌టీపీపీ ఇతర ప్రధాన సంస్థల్లో 85 శాతం స్థానికులకు ప్రాధ్యాన్యం ఇవ్వాలి. ఎర్రచందనం, ఇరత ఖనిజాల ఆదాయంలో సీమ ప్రాంతానికి 50 శాతం కేటాయించాలి 


5) తాడిపత్రిలో ఇది వరకే ఉన్న స్టీల్‌ ఫ్యాక్టరీ పరిధిని మరింత విస్తృతపరచాలి. అదనంగా మరో రెండు రైల్వే ఆధారిత స్టీల్‌ పరిశ్రమలను ప్రారంభించాలి. 


6) ప్రొద్దుటూరులోని పాల కేంద్రం, కాటన్‌మిల్లు, నందలూరులోని ఆల్విన్‌ కంపెనీ, చెన్నూరులోని చక్కెర పరిశ్రమ, రాయలసీమ ప్రాంతంలో మూత పడిన పరిశ్రమలన్నింటినీ పునరుద్ధరించి అభివృద్ధి చేయాలి. 


7) గుత్తి, గుంతకల్లు ప్రాంతాలలో రైల్వే ఆధారిత పరిశ్రమలన్ని ఏర్పాటు చేయాలి. పులివెందుల, కదిరి ప్రాంతాల్లో పరిశ్రమలను ఏర్పాటు చేయాలి. 


8) సీమ ప్రాంతంలో ఉన్న అపార ఖనిజాలను వెలికితీసి వాటి ఆధారిత పరిశ్రమలన్నీ ఈ ప్రాంతాలోనే ఏర్పాటు చేయాలి. 


9) కడప జిల్లాలోని తెలుగుగంగ, గాలేరు - నగరి, హంద్రీ నీవా సర్వరాయసాగర్‌ ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వం రూ.1500 కోట్ల బడ్జెట్టును కేటాయించి పూర్తి చేయాలి. కేసీ కాలువ స్థిరీకరణకు అవసరమైన రాజోలి రిజర్వాయర్‌ను పూర్తి చేయాలని సభా ముఖంగా కోరారు.