మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కంటతడి పెట్టారు. అప్రజాస్వామ్యంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తన మనవరాలు బి.వి.కీర్తి కార్పొరేటర్ గా ఓడించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఓడినా.. నా రాజకీయ వారసురాలు ఆమే అంటూ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ప్రకటించారు. 

ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుటుంబం తన కుటుంబంపై కక్ష సాధింపులకు దిగుతున్నారంటూ, భవిష్యత్తులో భూమన కుటుంబానికి కీర్తి ద్వారానే గట్టి పోటీ ఇచ్చేందుకు తన శాయశక్తులా కృషి చేస్తానని స్పష్టం చేశారు. 

మంగళవారం తిరుపతిలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో సుగుణమ్మ ప్రసంగించారు. తిరుపతి మున్సిపల్ ఎన్నికలు అప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయని, ఎన్నికైన అభ్యర్థులను ఎన్నడూ ప్రజలు ఎరుగరని, అధికార బలంతో, అక్రమమార్గంలో దౌర్జన్యంగా ఎన్నికయ్యారని ఆగ్రహించారు. వైసీపీ తరఫున ఎన్నికైన కార్పొరేటర్లు గతంలో ఎన్నడూ ప్రజల సమస్యలను తీర్చలేదన్నారు. 

ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరూ డివిజన్లలోని సమస్యల పరిష్కారం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. నగరాభివృద్ధి కోసం టీడీపీ అనేక కార్యక్రమాలు చేపట్టిందని గుర్తుచేశారు. అయితే రెండేళ్లుగా అధికారంలో ఉన్న వైసీపీ ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టి 48మంది కార్పొరేటర్లను గెలిపించుకుందో తెలపాలని ప్రశ్నించారు. 

తన మనవరాలు బి. వెంకట కీర్తి విదేశాల్లో చదువుకుందని, 18వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా బరిలో దిగిందని ఆమె మీద అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థి ప్రచారం కూడా సరిగా చేయలేదన్నారు. 

దీనికి భిన్నంగా కీర్తి ఇంటింటికీ తిరిగి ఓటర్లను కలిసిందన్నారు. అయినా  కీర్తి అప్రజాస్వామికంగా ఓడిపోయారని కన్నీరు పెట్టుకున్నారు. ఇప్పుడు అక్రమంగా కేసు పెట్టి ఆమెను అరెస్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేవారు. అధికార బలం ఎన్నో రోజులు నిలబడదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పరసా రత్నం, నరసింహ యాదవ్, ఆర్సీ మునికృష్ణ తదితరులు పాల్గొన్నారు.