పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదం: ఏనుగుల దాడిలో రైతు మృతి
పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు చెల్లింపేట గ్రామంపై దాడి చేసింది. ఏనుగుల దాడిలో వ్యక్తి మృతి చెందాడు.
విజయనగరం: పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు దాడిలో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామస్తులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని బలిజపేట మండలం చెల్లింపేట గ్రామంపై ఏనుగుల గుంపు దాడి చేసింది. దీంతో గ్రామస్తులు భయంతో పరుగులు తీశారు. మరో వైపు ఏనుగుల దాడిలో పరదేశీ అనే రైతు మృతిచెందాడు. ఈ ఘటనతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. తమ గ్రామానికి ఏనుగులు రాకుండా చూడాలని అటవీశాఖాధికారులను గ్రామస్తులు వేడుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు, విజయనగరం , శ్రీకాకుళం జిల్లాల్లో ఏనుగులు దాడులు ఇటీవల కాలంలో పెరిగిపోయాయి. ఆహరం కోసమో లేదా అడవి నుండి దారి తప్పి ఏనుగులు గ్రామాలపై దాడులకు దిగుతున్నాయి. పంటపొలాలపై ఏనుగులు దాడులకు దిగుతున్నాయని అటవీ శాఖాధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
చిత్తూరు జిల్లాలోని పలమనేరు మండలం పెంగరుగుంట పంచాయితీ పరిధిలోని ఇంద్రానగర్ లో పంటపొలాలపై ఏనుగుల గుంపు దాడి చేసింది. పొలం వద్దే ఉన్న ఓ రైతుపై ఏనుగులు దాడి చేశాయి. ఈ ఘటనలో రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన 2022 మే 25వ తేదీన ఈ ఘటన జరిగింది.
చిత్తూరు జిల్లాలోని సదుంజోగివారిపల్లె అటవీ ప్రాంతంలో పంటపొలాలపై ఏనుగులు దాడి చేశాయి. పంటకు కాపలాగా రాత్రి పూట అక్కడే పడుకున్న రైతు ఎల్లప్పపై ఏనుగులు దాడి చేశాయి. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన 2022 మార్చి 31న జరిగింది.
2011 జనవరి 13 న చిత్తూరు జిల్లాలో గ్రామాలపై దాడికి దిగుతున్న ఏనుగుల గుంపును అటవీ ప్రాంతంలోకి తరలిస్తున్న సమయంలో అటవీ శాఖాధికారిపై ఏనుగులు దాడి చేశాయి. ఈ ఘటనలో అటవీశాఖాధికారి చిన్నబ్బపై ఏనుగులు దాడికి దిగాయి. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు.
2021 మే 6వ తేదీన విజయనగరం జిల్లాలో ని కొమరాడ మండలం పాతకలికోటలో ఏనుగుల దాడిలో మహిళ మృతి చెందింది. ఏనుగుల దాడిలో పొలం చేస్తున్న మహిళా రైతు మృతి చెందింది. 2020 నవంబర్ 13న విజయనగరం జిల్లా కొమరాడ మండలం పరశురాంపురం గ్రామంలో ఏనుగుల గుంపు దాడి చేసింది. ఈ ఘటనలో లక్ష్మీనాయుడు మృతి చెందాడు.