ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎంపీలుగా విజయం సాధించినవారంతా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. కాగా... ఈ కార్యక్రమంలో ఓ అభిమాని అత్యుత్సాహం కలవరం రేపింది.

ఇంతకీ మ్యాటరేంటంటే... ఎంపీల ప్రమాణస్వీకార కార్యక్రమం చూడటానికి వారి కుటుంబసభ్యులు తరలి వచ్చి గ్యాలరీల్లో కూర్చుున్నారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తండ్రి లావు రత్తయ్య; గల్లా జయదేవ్‌ తల్లిదండ్రులు గల్లా అరుణ, రామచంద్రనాయుడు, ఆయన సతీమణి, కుమారులు; కేశినేని నాని కుటుంబసభ్యులు, రామ్మోహన్‌నాయుడు తల్లి, సతీమణి, మామ బండారు సత్యనారాయణమూర్తిలు గ్యాలరీల్లో కూర్చున్నారు.

విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ప్రమాణస్వీకారాణికి కుటుంబసభ్యులతో పాటు కొందరు అభిమానులు కూడా వచ్చారు. ఆయన పేరును పిలిచిన వెంటనే ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చున్న ఆయన అభిమానులు కొందరు గట్టిగా చప్పట్లు చరిచారు. దీంతో లోక్‌సభ భద్రతా సిబ్బంది వారిని బలవంతంగా బయటికి పంపించేశారు. 

లోక్‌సభ గ్యాలరీలో కూర్చున్న వారు ఎలాంటి శబ్ద్దం చేయడానికి వీల్లేదు. కాలు మీద కాలేసుకొని కూర్చోవడానికి కూడా అనుమతించరు. అలాంటిది బిగ్గరగా చప్పట్లు చరచడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇలాంటి విషయాల్లో కఠినంగా వ్యవహరించే లోక్‌సభ భద్రతా సిబ్బంది వెంటనే చప్పట్లు చరిచిన వారిని గుర్తించి బలవంతంగా బయటికి పంపించేశారు.