అతనికి హాయిగా.. కాలి మీద కాలు వేసుకొని బతికేంత ఆస్తి ఉంది. కానీ.. తనను ప్రేమగా చూసుకునే వాళ్లేలేరు. తనకు తరగని ఆస్తి ఉన్నప్పటికీ.. దానిని అనుభవించడానికి పిల్లలు లేరు. దీంతో.. భార్యతో కలిసి ఓ యువతిని దత్తత తీసుకున్నారు. ఆమెకు కొంత ఆస్తి రాసి ప్రేమగా చూసుకున్నారు. అయితే.. భార్య దూరమయ్యాక.. ఆ యువతి అతని బాధ్యత పట్టించుకోవడం మానేసింది. ఈ క్రమంలో అతని ఆస్తి పై సొంత తమ్ముడు కన్నేశాడు. తీరా ఆస్తి తమకు దక్కకుండా పోతుందనే భయం పుట్టగానే.. అతనిని అతి దారుణంగా చంపేశాడు. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

చిన్నాయిగూడెంకు చెందిన గెడ భాస్కరరావు (60)కి మంచి ఆస్తి ఉంది. భార్య లక్ష్మీకాంతంకి పిల్లలు కలగపోవడంతో శ్వేత అనే యువతిని దత్తత తీసుకున్నారు. ఆమెకు పదెకరాలు పొలం కూడా రాసి ఇచ్చాడు. ఆ తర్వాత కొంతకాలానికి భార్య చనిపోవడంతో.. దత్తత కూతురి దగ్గరే ఉంటున్నాడు. ఈ క్రమంలో.. సదరు యువతి తమ్ముడు కిరణ్ కి కూడా మరో 8 ఎకరాలు పొలం రాసి ఇచ్చాడు. ఆస్తి తమ చేతికి రాగానే.. వారు భాస్కరరావుని పట్టించుకోవడం మానేశారు. దీంతో..  శ్వేత దత్తతను, కిరణ్‌కు ఇచ్చిన పొలం రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని భాస్కరరావు కోర్టును ఆశ్రయించారు.

ఈ నేపథ్యంలో.. భాస్కరరావు ఆస్తి పై అతని సోదరుడు సత్యనారాయణ, అతని భార్య రాధాకృష్ణవేణి కన్నేశారు. అతని వద్ద ఉన్న మిగిలిన పదెకరాలను తమ  కూతుళ్లకు రాయించుకోవాలని అనుకున్నారు. అయితే.. అందరూ తన ఆస్తి మీదే కన్నేశారని భావించిన భాస్కర్ రావు.. వేరే పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. అయితే.. భాస్కర్ రావు ఇంకో పెళ్లి చేసుకుంటే.. తమకు ఆస్తి దక్కదని సత్య నారాయణ, రాధాకృష్ణకు భయం పట్టుకుంది. దీంతో.. అతనిని చంపేయాలని నిర్ణయం తీసుకున్నారు. పథకం ప్రకారం పొలానికి వెళ్లిన భాస్కర్ రావుని కిరాతకంగా చంపేశారు. అనంతరం ప్రమాదంగా నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే.. పోలీసుల దర్యాప్తులో అతి హత్యగా తేలడంతో.. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.