ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షా ఫలితాలు ముగ్గురు విద్యార్థుల ప్రాణాలను బలిగొన్నాయి. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని ముగ్గురు ఆత్మహత్య చేసుకోగా, మరో ఇద్దరు ఆత్మహత్యాయత్నం చేశారు. 

ఆంధ్రప్రదేశ్ : ప్రస్తుత పరిస్థితుల్లో అవగాహన కంటే ర్యాంకులకే అధిక ప్రాధాన్యత ఇస్తుండడంతో విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతోంది. అందరికంటే బాగా చదవాలి, మొదటి స్థానంలో నిలవాలన్న టార్గెట్ లతో సతమతమవుతున్నారు. శక్తికి మించి చదువుతున్నారు. కానీ పరీక్షలు అనేసరికి భయాందోళనలకు గురవుతున్నారు. సరిగ్గా రాయలేదనో, అంచనాలను అందుకోలేకపోయామనో, ర్యాంక్ రాలేదనో, పాస్ అవలేదనో ఇలా ఎన్నో కారణాలతో విద్యార్థులు.. తమ నిండు జీవితాన్ని ముగించేస్తున్నారు.

వైఫల్యాలు ఎదురైతే తట్టుకోలేకపోతున్నారు. తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కన్నవారికి తీరని కడుపుకోత మిగులుస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. అయితే గతంలో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం తగ్గింది. అంతేకాదు… పరీక్షల్లో ఫెయిల్ అయిన మనస్థాపంతో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. 

అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అవ్వడంతో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. చెన్నేకొత్తపల్లిలో ఉరి వేసుకున్న ఓ విద్యార్థిని, పామిడి మండలం కట్టకిందపల్లిలో విషగుళికలు తాగి మరో విద్యార్థిని, నల్లచెరువు మండలానికి చెందిన ఓ విద్యార్థిని అన్నమయ్య జిల్లాలో ఆత్మహత్య చేసుకున్నారు. కనగానపల్లి మండలం కుర్లపల్లి తండాలో ఫినాయిల్ తాగి ఓ విద్యార్థి... చెన్నేకొత్తపల్లి మండలంలోని ప్యాదిండికి చెందిన మరో విద్యార్థిని రసాయనిక ద్రావకం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. 

కాగా, సోమవారం టెన్త్ క్లాస్ ఫలితాల్లో ఫెయిల్ కావడంతో పేరెంట్స్ మందలించారని.. విశాఖపట్నం జిల్లాలోని వేపగుంట అప్పల నరసయ్య కాలనీకి చెందిన టెన్త్ క్లాస్ విద్యార్థి సాయి అదృశ్యమయ్యాడు. సోమవారం ప్రకటించిన టెన్త్ క్లాసు పరీక్షలలో సాయి రెండు సబ్జెక్టులో ఫెయిల్ అయ్యారు. ఈ విషయాన్ని గుర్తించిన తల్లిదండ్రులు సాయిని మందలించారు. దీంతో సాయి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. మేఘాద్రిడ్డ డ్యామ్ వద్ద సాయి సెల్ ఫోన్, చెప్పులను పోలీసులు గుర్తించారు. డ్యామ్ లో దూకి సాయి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. సాయి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల ఫలితాలు విద్యుత్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం విడుదల చేశారు. ఈ ఏడాది ఫలితాలు గ్రేడ్‌ల రూపంలో కాకుండా మార్కుల రూపంలో ఉంటాయని అధికారులు ఇదివరకే ప్రకటించారు. ఫెయిలైన విద్యార్థులకు వచ్చే నెల 6 నుంచి 10 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. వారి కోసం స్పెషల్ క్లాసెస్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.