రోడ్డున పడుతున్న ‘దేశం’ కుమ్ములాటలు

రోడ్డున పడుతున్న ‘దేశం’ కుమ్ములాటలు

అధికార తెలుగుదేశంపార్టీకి చెందిన రిజర్వుడు నియోజకవర్గాల్లో నేతల మధ్య కుమ్ములాటలు తారాస్ధాయికి చేరుకుంటున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపధ్యంలో పార్టీలో కుమ్ములాటలు రోడ్డున పడుతుండటంపై చంద్రబాబునాయుడులో కూడా ఆందోళన పెరుగుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో మంత్రులకు, నేతలకు పడటం లేదు. మరికొన్ని నియోజవకవర్గాల్లో ఎంఎల్ఏలకు నేతలకు పొసగటం లేదు. ఇంకొన్ని నియోజకవర్గాల్లో ఫిరాయింపు ఎంఎల్ఏలకు టిడిపి నేతలకు ఏమాత్రం పడటం లేదు. ఇటువంటి నేపధ్యంలో నేతల మధ్య సయోధ్య కుదర్చటమన్నది చంద్రబాబుకు పెద్ద సమస్యగా మారింది.

పశ్చిమగోదావరి జిల్లాలోని మంత్రి కెఎస్ జవహర్ నియోజకవర్గం కొవ్వూరులో రెండు వర్గాలు రెడ్డెక్కాయి. అందులో ఒకటి మంత్రికి అనుకూలంగా మరోటి వ్యతిరేకంగా. ఈ నియోజకవర్గంలోని రెండు గ్రూపులకు చాలా కాలంగా పడటం లేదన్న విషయం అందరికీ తెలిసిందే. ఇదే జిల్లాలోని చింతలపూడి నియోజకవర్గంలో మాజీ మంత్రి పీతల సుజాత ను ఎంపి మాగంటి బాబు గ్రూపు పూర్తి స్ధాయిలో వ్యతిరేకిస్తోంది. తరచూ రెండు గ్రూపులు గొడవలు పడుతూనే ఉన్నాయి.

అదే విధంగా పోలవరం నియోజకవర్గంలో కూడా పార్టీ రెండు గ్రూపులుగా చీలిపోయింది. ఇక్కడ కూడా సీనియర్ నేతల్లో కొందరు ఎంపి వర్గం కాగా మిగిలిన నేతలు ఎంఎల్ఏ ముడియం శ్రీనివాస్ వర్గంగా చెలామణి అవుతున్నారు. ఏ విషయంలో కూడా రెండు వర్గాలకు పడటం లేదు.  

ఇక, గుంటూరు జిల్లాలో మాజీ మంత్రి రావెల కిషోర్ బాబుకు పార్టీలోని ఇతర నేతలకు పడటం లేదు. దానికితోడు రావెల వైసిపిలో చేరుతారనే ప్రచారం ఉండటంతో పార్టీ నేతలు రావెలను ఏమాత్రం లెక్క చేయటం లేదు.  కడప జిల్లా బద్వేలులో ఇదే పరిస్ధితి. ఇక్కడ ఫిరాయింపు ఎంఎల్ఏ జయరాములకు పార్టీ నేతలకు ఏమాత్రం పడటం లేదు. మాజీ ఎంల్ఏ విజయమ్మ, పోయిన ఎన్నికల్లో పోటీ చేసిన విజయజ్యోతి, జయరాములు మూడు వర్గాలకు నాయకత్వం వహిస్తున్నారు.

ఇదే జిల్లాలోని రైల్వే కోడూరులో కాంగ్రెస్ నుండి టిడిపిలోకి చేరిన మాజీ ఎంఎల్సీ చెంగల్రాయుడికి నియోజకవర్గ ఇన్చార్జి విశ్వనాధనాయుడికి ఏమాత్రం పొసగటం లేదు. నెల్లూరు జిల్లాలోని సూళ్ళూరుపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి పరసా వెంకటరత్నంకు పార్టీ నేతలతో ఏమాత్రం పడటం లేదు. కర్నూలు జిల్లా కోడుమూరులో ఫిరాయింపు ఎంఎల్ఏ మణిగాంధికి నియోజకవర్గం ఇన్చార్జి విష్ణువర్దనరెడ్డికి పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటోంది. తీవ్రస్ధాయిలో గొడవలు జరుగుతున్న నియోజవకవర్గాల్లో పైన చెప్పినవి కొన్ని మాత్రమే. జన్మభూమి కార్యక్రమం పూర్తయిన తర్వాత వీటిపై దృష్టి పెట్టాలని చంద్రబాబునాయుడు నిర్ణయించుకున్నారని సమాచారం. మరి, ఏమేరకు విభేదాలు పరిష్కారమవుతాయో చూడాలి.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page