అమరావతి: ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం చేసే దిశగా వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోందని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుని తీరతామని స్పష్టం చేశారు. ఈనెల 24న మధ్యంతర నివేదికను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి అందజేస్తామని తెలిపారు. 

ఆర్టీసీ ఉద్యోగులు ఇకపై ప్రభుత్వ ఉద్యోగస్తులుగానే గుర్తించాలనే నిర్ణయానికి కమిటీ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని స్పష్టం చేశారు. ఆర్టీసీని ఎలా నడపాలి, నష్టాలను ఎలా అధిగమించాలి అనే అంశాలపై చర్చిస్తున్నట్లు తెలిపారు. 

ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం ఆర్టీసీ విలీనంపై అధ్యయన కమిటీ, కేబినెట్ సబ్ కమిటీలను నియమించిన సంగతి తెలిసిందేనన్నారు. మధ్యంతర నివేదికను అధ్యయన కమిటీ అందజేసిందని నివేదిక ఆధారంగా నిర్ణయాలు ఉంటాయన్నారు. అయితే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో ఎలా విలీనం చేయాలనే అంశంపై తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. 

మరోవైపు సమాచార శాఖలో గత ప్రభుత్వం బిల్లులు పెద్ద ఎత్తున పెండింగ్ పెట్టిందని ఆరోపించారు. జర్నలిస్టులకు ఇళ్లు అందించేందుకు సాయశక్తులా కృషి చేస్తాననిమంత్రి పేర్ని నాని  హామీ ఇచ్చారు.