ఆనందయ్య ఇచ్చే  కంటి చుక్కల మందుపై నిపుణుల కమిటీ నివేదిక ప్రభుత్వానికి చేరింది. కంటి చుక్కల మందు వల్ల దుష్ప్రభావాలు కనిపించలేదని నివేదికలో పేర్కొన్నారు. కళ్లలో వాడే మందు విషయంలో కొన్ని నిర్దేశిత ప్రమాణాలున్నాయని నిపుణులు వెల్లడించారు. ఆ ప్రమాణాలకు అనుగుణంగా ఆనందయ్య ఇచ్చే కంటి చుక్కల మందు లేదని తెలిపారు. తయారీ, నిల్వ విధానాల్లో ఈ ప్రమాణాలు పాటించాలని నిపుణులు వెల్లడించారు.

Also Read:ఆనందయ్య కంటిమందుకు ప్రభుత్వం షాక్: ఆర్డర్స్ ను రిజర్వ్ చేసిన హైకోర్టు

కళ్లలో వేసే మందుకు రంగు ఉండకూడదని.. కానీ ఆనందయ్య మందు కొంత కలర్‌గా వుందని నిపుణులు తెలిపారు. 8 రకాల పరీక్షలు చేయగా.. ఇబ్బందులు ఏమీ గుర్తించలేదని నివేదికలో ప్రస్తావించారు. నిల్వ, తయారీ విధానాల్లో మార్పులు చేయాలని అభిప్రాయపడింది. నిల్వ కూడా గాజు పాత్రలు లేదా, మందులు నిల్వ చేసే పాత్రల్లో వుంచాలని సూచించింది. క్లోజ్డ్ ఏరియాల్లో ల్యాబ్ తరహాలో మందును తయారు చేయాలని.. నిర్దేశిత ప్రమాణాల్లో తయారు చేశాక మాత్రమే స్టెరైల్ టెస్ట్ చేయగలమని నిపుణులు స్పష్టం చేశారు. కె మందు హానికరం కాదని, ఉపయోగించుకోవచ్చని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. 

కాగా, తాను కరోనా రోగులకు అందించే అన్ని మందులకు అనుమతించినట్లే కంటిలో వేసే మందుకు అనుమతుల కోసం ఆనందయ్య హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆయన పిటిషన్ పై ఇవాళ(గురువారం) న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఆ మందుకు అనుమతి ఇవ్వలేమని ప్రభుత్వం తేల్చింది. ఈ కంటిచుక్కల మందుపై పరీక్షలు నిర్వహించామని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. ఇరువర్గాల వాదన విన్న న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది.