మాజీ ఎంపీ, టిడిపి మాజీ ఛైర్మన్ ఆదికేశవులు నాయుడు మనవరాలు చైతన్య జనసేన పార్టీలో చేరారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆమెకు జనసేన కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు.
విజయవాడ : ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో జనసేన పార్టీ జోరు పెంచింది. ఓవైపు వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి పార్టీని తీసుకువెళుతూనే మరోవైపు నాయకత్వాన్ని పటిష్టం చేసేందుకు జనసేనాని పవన్ కల్యాణ్ ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే జనసేన పార్టీలో చేరికకు ఆసక్తి చూపుతున్న నాయకులను సాదరంగా ఆహ్వానిస్తున్నారు. ఇలా ప్రముఖ వ్యాపారవేత్త, టిటిడి మాజీ ఛైర్మన్ డి.కె. ఆదికేశవులు నాయుడు మనవరాలు చైతన్య జనసేన పార్టీలో చేరారు.
మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో చైతన్య చేరిక కార్యక్రమం జరిగింది. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆమెకు కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. ఈ సదర్భంగా ఆమెకు పవన్ శుభాకాంక్షలు తెలిపారు. తాత ఆదేకేశవులు నాయుడు మాదిరిగానే రాజకీయ నాయకురాలిగా మంచిపేరు తెచ్చుకోవాలని చైతన్యకు సూచించారు పవన్.

చిత్తూరు జిల్లాకు చెందిన డి.కె. ఆదికేశవులు నాయుడు కూతురు తేజస్విని కూతురే చైతన్య. ఈమె ఇప్పటికే ఓ ట్రస్ట్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. జనసేన పార్టీ విధానాలకు ఆకర్షితురాలైన ఆమె తాజాగా ఆ పార్టీలో చేరారు.
Also Read ఆపరేషన్ ఆకర్ష్: వైఎస్ఆర్‌సీపీ అసంతృప్తులకు వల, జనసేనలో చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... తాత వారసత్వాన్ని పునికిపుచ్చుకున్న చైతన్య ఎన్నో సేవాకార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. ఆమే జనసేన పార్టీలో చేరడం మంచి పరిణామమని అన్నారు. ఎంపీగా చిత్తూరు అభివృద్ది, టిటిడి బోర్డు ఛైర్మన్ గా తిరుమల అభివృద్దికి ఆదికేశవులు నాయుడు ఎంతగానో కృషిచేసారని అన్నారు. ఆయన స్పూర్తినే కొనసాగించాలని చైతన్యకు పవన్ కల్యాణ్ సూచించారు.
ఇక అధికార వైసిపి ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ కూడా జనసేన పార్టీలో చేరారు. తన అనుచరుతలతో కలిసి పవన్ కల్యాణ్ సమక్షంలో వంశీకృష్ణ జనసేనలో చేరారు. తనలాగే చాలామంది వైసిపిని వీడి జనసేనలో చేరేందుకు సిద్దంగా వున్నారని వంశీకృష్ణ తెలిపారు. అభిమానులే కాదు తనలాంటి నాయకులు సైతం పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారని... అందుకోసం జనసేనలో చేరుతున్నామని అన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన సత్తా చాటుతుందని వంశీకృష్ణ పేర్కొన్నారు.
