ఆపరేషన్ ఆకర్ష్: వైఎస్ఆర్‌సీపీ అసంతృప్తులకు వల, జనసేనలో చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి.ఈ తరుణంలో అధికార వైఎస్ఆర్‌సీపీలో అసంతృప్తులపై తెలుగుదేశం, జనసేనలు కన్నేశాయి.
అమరావతి: యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్‌సీపీ ) ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ బుధవారంనాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. తన అనుచరులతో కలిసి వంశీకృష్ణ యాదవ్ జనసేనలో చేరారు. ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్‌సీపీకి జనసేన ఎర్త్ పెడుతుంది. 2024 ఏప్రిల్ మాసంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి విశాఖపట్టణం జిల్లాలోని గాజువాక నుండే పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది.ఈ తరుణంలో ఉమ్మడి విశాఖ పట్టణం జిల్లాపై పవన్ కళ్యాణ్ ఫోకస్ పెంచారు. గతంలో తెలుగుదేశం, వైఎస్ఆర్‌సీపీలలో పనిచేసిన పంచకర్ల రమేష్ బాబు కూడ జనసేనలో చేరారు. తాజాగా ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ జనసేనలో చేరడం ఆ పార్టీకి కలిసి వచ్చే పరిణామంగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
also read:ఆయేషా మీరా హత్యకు నేటికి 16 ఏళ్లు: ఎన్నో మలుపులు, తేలని దోషులు
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేనలు కలిసి పోటీ చేయనున్నాయి. త్వరలోనే ఈ రెండు పార్టీలు ఉమ్మడి మేనిఫెస్టోను కూడ విడుదల చేయనున్నాయి. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో పోటీ చేయాలని జనసేన ప్లాన్ చేస్తుంది.ఈ మేరకు జనసేన నేతలు కూడ పోటీకి రంగం సిద్దం చేసుకుంటున్నారు.ఇతర పార్టీల్లోని అసంతృప్తులు కూడ జనసేన, తెలుగుదేశం పార్టీల్లో చేరేందుకు ప్రయత్నం చేస్తున్నారు.ఈ విషయాన్ని గమనించిన ఈ రెండు పార్టీలు ఇతర పార్టీల్లోని సమర్ధులైన నేతలను తమ పార్టీల్లోకి ఆహ్వానిస్తున్నారు. వైఎస్ఆర్‌సీపీకి చెందిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ జనసేన నేతలతో టచ్ లోకి వెళ్లారు. వంశీకృష్ణ చేరికపై ఆ పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వంశీకృష్ణ యాదవ్ వైఎస్ఆర్‌సీపీని వీడకుండా ఉండేందుకు వైఎస్ఆర్ సీపీ నేతలు ప్రయత్నాలు నిన్నటి వరకు ప్రయత్నించారు. కానీ వంశీకృష్ణ యాదవ్ మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.
also read:ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ కూటమి:బాబుకు దెబ్బేనా?
వైఎస్ఆర్‌సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గెలుపు గుర్రాలకే టిక్కెట్లు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు.ఈ మేరకు ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంచార్జీలను మార్చుతున్నారు.ఈ ప్రక్రియ సాగుతుంది.ఇప్పటికే 11 అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జీలను మార్చారు. రెండు రోజుల్లో మరికొన్ని నియోజకవర్గాల్లో మార్పునకు సంబంధించి జగన్ ప్రకటన చేసే అవకాశం ఉంది. దీంతో వైఎస్ఆర్‌సీపీలోని అసంతృప్తులపై కూడ ఈ రెండు పార్టీలు కేంద్రీకరించాయి. అధికార పార్టీలోని అసంతృప్తుల్లో మంచివారిని చేర్చుకోవడాన్ని పరిశీలించనున్నట్టుగా చంద్రబాబు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో వైఎస్ఆర్‌సీపీ నుండి కూడ పలువురు నేతలు తెలుగుదేశం, జనసేనలో చేరే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో పలువురు నేతలు వైఎస్ఆర్‌సీపీని వీడుతారని వంశీకృష్ణ యాదవ్ ప్రకటించిన విషయం తెలిసిందే.