దేశంలో ప్రతిపక్షం లేకుండా చేయాలనేదే బీజేపీ స్ట్రాటజీ అన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ సందర్భంగా జాతీయ పార్టీ ప్రస్తావన రాలేదని ఆయన తెలిపారు. బీజేపీని అడ్డుకోకుంటే దేశం నష్టపోతుందని ఉండవల్లి హెచ్చరించారు.
బీజేపీది (bjp) కాంగ్రెస్ (congress) ముక్త్ భారత్ కాదని.. అపోజిషన్ ముక్త్ భారత్ అంటూ సెటైర్లు వేశారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ (vundavalli arun kumar) . నిన్న తెలంగాణ సీఎం కేసీఆర్‌తో (kcr) ఆయన దాదాపు మూడు గంటల పాటు చర్చలు జరిపిన నేపథ్యంలో వీరిద్దరి భేటీకి తెలుగు రాష్ట్రాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. దీనికి సంబంధించిన వివరాలను తెలియజేసేందుకు ఉండవల్లి సోమవారం మీడియా ముందుకు వచ్చారు. కేసీఆర్ కొద్దిరోజుల క్రితం తనకు ఫోన్ చేసి పిలిచారని ఉండవల్లి తెలిపారు. తాను వెజిటేరియన్ వంటలే తింటానని తెలుసుకుని .. కేసీఆర్ కూడా అదే తిన్నారని ఆయన వెల్లడించారు. ఎలాంటి పార్టీ ఏర్పాటు గురించి చర్చించలేదని ఉండవల్లి పేర్కొన్నారు. కేసీఆర్‌ను తాను కలిసి దాదాపు పదేళ్లు అవుతోందన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.
ఆంధ్రప్రదేశ్‌లో వున్నంత బలంగా బీజేపీ ఎక్కడా లేదని అరుణ్ కుమార్ అన్నారు. బీజేపీని సరిగా వ్యతిరేకించకపోతే రాబోయే రోజుల్లో చాలా ప్రమాదాలు జరుగుతాయని ఆయన హెచ్చరించారు. బీజేపీ విషయంలో కేసీఆర్‌ది, నాది ఒకే అభిప్రాయమని ఉండవల్లి అరుణ్ కుమార్ స్పష్టం చేశారు. ఏపీలో వైసీపీ, టీడీపీ, జనసేన అంతా బీజేపీతోనే వుంటాయని.. బీజేపీని జగన్ కానీ (ys jagan), చంద్రబాబు కానీ (chandrababu naidu), పవన్ కానీ (pawan kalyan) ఒక్క మాట కూడా అనరని ఉండవల్లి పేర్కొన్నారు. ఏపీలో ఏ పార్టీ గెలిచినా బీజేపీ గెలిచినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీపై తనకు వ్యతిరేకత లేదని.. వారి విధానాల్నే తాను విమర్శిస్తున్నానని ఉండవల్లి స్పష్టం చేశారు. బీజేపీ వైఖరి వల్ల అంతర్జాతీయంగా మనదేశ ప్రతిష్ట దెబ్బతింటోందని అరుణ్ కుమార్ హెచ్చరించారు.
ALso Read:బ్రేకింగ్: కేసీఆర్‌తో ఉండవల్లి అరుణ్ కుమార్ భేటీ
కేసీఆర్‌కు చాలా క్లారిటీ వుందని.. తాను రాజకీయాల నుంచి రిటైర్ అయ్యానని ఉండవల్లి అరుణ్ కుమార్ స్పష్టం చేశారు. తాను కేసీఆర్‌తో భేటీ అయినప్పుడు ప్రశాంత్ కిషోర్ అక్కడే వున్నారని.. కేసీఆర్ అన్ని విషయాలను త్వరలో వివరంగా చెబుతారని వుండవల్లి పేర్కొన్నారు. బీజేపీ వల్ల రాబోయే రోజుల్లో మరింత ప్రమాదం పెరుగుతుందని.. దేశ రాజకీయాలపై కేసీఆర్ తనకన్నా ఎక్కువ స్టడీ చేశారని అరుణ్ కుమార్ పేర్కొన్నారు. మమతా బెనర్జీ కన్నా కేసీఆర్ అన్ని విషయాలపై బాగా చెప్పగలరని ఉండవల్లి ప్రశంసించారు. జాతీయ పార్టీ గురించి తాము అసలు చర్చించుకోలేదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ వీక్ అవుతోంది కాబట్టి బీజేపీకి గట్టి కౌంటర్ అటాక్ ఎవరు ఇవ్వాలని ఉండవల్లి ప్రశ్నించారు.
గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన తాఖీదులతో భారతదేశం గుడ్‌విల్ దెబ్బతింటోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ పాలనలోని లోపాలను గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లేవారు లేరని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. జాతీయ పార్టీని ఆల్టర్నేటివ్‌గా డెవలప్ చేయాలనేది కేసీఆర్ కాన్సెప్ట్ అని ఆయన స్పష్టం చేశారు. నెహ్రూకి కేసీఆర్ పెద్ద ఫ్యాన్ అని ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశంసించారు. కేసీఆర్ కరెక్ట్ లైన్‌లోనే వెళ్తున్నారని తాను భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. విద్యుత్ సహా అన్ని అంశాలపై అవతలివారు కౌంటర్ చేయలేనంతగా కేసీఆర్ హోంవర్క్ చేశారని ఉండవల్లి తెలిపారు. భారతీయ రాష్ట్రీయ సమితి (బిఆర్ఎస్) అనేది తమ చర్చల్లో ప్రస్తావనకే రాలేదన్నారు. ఈ విషయం మీద కేసీఆర్ ఎప్పుడు పిలిచినా తాను వెళ్తానని ఉండవల్లి అరుణ్ కుమార్ స్ఫష్టం చేశారు.
బీజేపీకి ప్రత్యామ్నామ ఫ్రంట్ అవసరమని కేసీఆర్ చెప్పారని.. బీజేపీపై వ్యతిరేకంగా వాదన వినిపించాలన్నారని ఉండవల్లి తెలిపారు. బీజేపీ వల్ల దేశానికి జరిగే నష్టాన్ని.. ప్రజలకు వివరించాలన్నదే తన ఉద్దేశ్యమని అరుణ్ కుమార్ పేర్కొన్నారు. మమతా, స్టాలిన్, అఖిలేష్, ఠాక్రే లాంటి వాళ్లు చాలా మంది వున్నా.. కేసీఆర్‌లా వాళ్లు మాట్లాడలేరని ఆయన ప్రశంసించారు.
