అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై  కీలక వ్యాఖ్యలు చేశారు అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. జగన్ మావాడు, అధికారంలోకి వచ్చాడు అంటూ చెప్పుకొచ్చారు. జగన్ కు అభినందనలు తెలిపారు. 

తాము ఓటమి చెందామని దాని గురించి ఇకపై ఆలోచించదలచుకోలేదన్నారు. తాను ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓడిపోవడంతో ఇక రాజకీయాలకు దూరంగా ఉండదలచుకున్నానని అందువల్లే ఎందుకు ఓడిపోయామో అన్న దానిపై విశ్లేషించదలచుకోలేదన్నారు. 

ఓ మీడియా ఛానెల్ తో మాట్లాడిన జేసీ దివాకార్ రెడ్డి జగన్ మావాడు, ముఖ్యమంత్రి అయ్యాడు కంగ్రాట్యులేషన్స్ టు హిమ్ అంటూ చెప్పుకొచ్చారు. వైయస్ జగన్ నిజాయితీని తాను అభినందిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక హోదా విషయంలో వైయస్ జగన్ మెుదటి నుంచి నిజాయితీగా ఉన్నాడని తెలిపారు. 

కచ్చితంగా జగన్ ప్రత్యేక హోదా సాధిస్తాడని స్పష్టం చేశారు. ఢిల్లీలో వైయస్ జగన్ మాట్లాడిన తీరు అద్భుతమని కొనియాడారు. మోదీ మేజిక్ ఫిగర్ కంటే విజయం సాధించడం మన ఖర్మ అంటూ జగన్ అనడాన్ని ఆయన అభినందించారు. 

కేంద్రంలో బీజేపీ అత్యధిక మెజారిటీతో అధికారంలోకి రావడంతో తాను నమస్కారం పెట్టడం తప్ప మెడపట్లకు, సిగపట్లకు వెళ్లేది లేదని జగన్ చెప్పడం మంచి పరిణామమన్నారు. అది వాస్తవం కూడా అని చెప్పుకొచ్చారు. 

ఎన్డీఏలో తాము ఉన్నప్పుడే మోదీని ప్రత్యేక హోదా కోసం నిలదీస్తే అప్పుడే వినలేదని ఇప్పుడు సిగపట్లు, మెడపట్లకు వెళ్తే సరికాదని అందులో జగన్ తీసుకున్న నిర్ణయం అభినందనీయం అన్నారు. 

ఎన్నికల్లో ధనప్రవాహాన్ని అరికట్టాలని కేంద్ర ఎన్నికల సంఘంపై తాను పోరాటం చేస్తానని చెప్పుకొచ్చారు. 100శాతం అది నెరవేరకపోయినప్పటికీ తాను మాత్రం పోరాటం చేస్తానని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. 

ఇకపోతే ఎన్నికల ప్రచారంలో వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు జేసీ దివాకర్ రెడ్డి.  అనంతపురం జిల్లా ధర్మపోరాట దీక్షలో వైఎస్ జగన్ కు కులపిచ్చి ఉందంటూ ఆరోపించారు.  

జగన్ కులప్రతిపాదకన ఓట్లు అడుగుతున్నాడంటూ మండిపడ్డారు. రెడ్డి, రెడ్డి, రెడ్డి అంటున్నారు. పెళ్లిళ్లు చేసుకున్నప్పుడు అడ్డు రాని కులం, ఓట్లు అడిగేటప్పుడు మాత్రమే ఎందుకు వస్తోంది? అంటూ నిలదీశారు. 

ప్రజల ఆదరణ ఉంటే సీఎం అవుతారు తప్ప కులాభిమానంతో కాదని జేసీ చెప్పారు. కానీ నీ సత్తా ఏంది..? నీ ముఖానికి ఏం విలువ ఉంది..? రెడ్లు అయితే కొమ్ములు ఉంటాయా..? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

రెడ్డిని అని విరుచుకుపడుతున్న జగన్ నీ చెల్లెలు ఏ కులస్థుడిని పెళ్లి చేసుకుంది? బ్రాహ్మణుడిని చేసుకోలేదా అంటూ నిలదీశారు. సమాజంలో అందరం ఒక్కటేనన్న భావనతో ఆమె పెళ్లి చేసుకుందని గుర్తు చేశారు. తాజాగా జగన్ మావాడు అంటూ ప్రశంసిచండంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.