విజయనగరం: మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖర రాజు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీపై తీవ్రమైన వ్యాఖ్యలుచేశారు. ఆయన వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి మామయ్య.  మాజీ మంత్రి, ఎమ్మెల్సీ శత్రుచర్ల విజయరామరాజు సోదరుడు కూడా.. 

ఆయన రాజీనామాతో వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి షాక్ తగిలినట్లే. ఆయన గురువారం చినమేరంగిలో మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో వైసీపీ నియంతృత్వ పోకడలు నచ్చకనే పార్టీకి రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. 

ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేయకపోతే పింఛన్లు, ఇళ్లు తదితర సంక్షేమ పథకాలు వర్తించవని వాలంటీర్ల ద్వారా బహిరంగంగా పార్టీ నాయకులు చెప్పించారని ఆయన ఆరోపించారు. ఇది సరైన విధానం కాదని శత్రుచర్ల చంద్రశేఖర రాజు అన్నారు 

ప్రస్తుత ప్రభుత్వం తీరుతో రాష్ట్రం అధోగతి పాలవుతోందని ఆయన అన్నారు. తన నలబై ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రస్తుతం జరుగుతున్ రాజకీయ దాడులను, బెదిరింపులను చూడలేదని అన్నారు. ఇలాంటి చర్యలు తనను బాధించడంతోనే పార్టీకి రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. కార్యకర్తలతో, అనుచరులతో త్వరలో చర్చించి భవిష్యత్తుపై నిర్ణయం తీుసకుంటానని ఆయన చెప్పారు.