తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్‌కు ప్రభుత్వం కొత్త ఛైర్మన్‌ను నియమించింది. మాజీ ఎమ్మెల్యే సాయికృష్ణ యాచేంద్రను నియమిస్తూ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. 

లైంగిక వేధింపులతో ఎస్వీబీసీ చైర్మన్‌గా వున్న సినీనటుడు పృథ్వీరాజ్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ కు కొత్త చైర్మన్ ఎంపిక పై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది.

ఎస్వీబీసీ కొత్త చైర్మన్ రేసులో ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. వీరిలో ప్రముఖ జర్నలిస్ట్ స్వప్న, వైఎస్సార్ కు అత్యంత సన్నిహితుడైన డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి పేరు తెరపైకి వచ్చాయి.

ప్రస్తుతం ఎస్వీబీసీలో స్వప్న, శ్రీనివాసరెడ్డిలు ఇద్దరు కూడా డైరక్టర్లుగా పనిచేస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక వీరిరువురికి ఎస్వీబీసీలో డైరెక్టర్లుగా స్థానం కల్పించారు. ఇప్పటికే తిరుమల పవిత్రతను ఏపీ ప్రభుత్వం దెబ్బతీస్తోందని ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇలాంటి సమయంలో తాజాగా పృథ్వీ ఎపిసోడ్ ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిస్థితిని తెచ్చి పెట్టింది. దీంతో తిరుమలలో పదవుల ఎంపికపై ఇక ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వకూడదని జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.