Asianet News TeluguAsianet News Telugu

మరో మాజీ ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చిన వైసీపీ.. పార్టీ నుంచి డీవై దాస్‌ సస్పెన్షన్..

పామర్రు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత డీవై దాస్‌కు గట్టి షాక్‌ తగిలింది. ఆయనను వైసీపీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది.

Ex MLA DY Dasu Suspended from YSRCP
Author
First Published Oct 19, 2022, 11:28 AM IST

పామర్రు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత డీవై దాస్‌కు గట్టి షాక్‌ తగిలింది. ఆయనను వైసీపీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టుగా ఫిర్యాదులు రావడంతో.. క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఆ ప్రకటనలో పేర్కొంది. అయితే పార్టీ నుంచి తనను సస్పెండ్ చేసినట్టుగా ఎలాంటి సమాచారం అందలేదని డీవై దాస్ చెప్పారు. 

తాను నాలుగేళ్లు వైసీపీలో కొనసాగుతున్నానని డీవై దాస్ చెప్పారు. తాను ఎక్కడ పార్టీకి ఇబ్బంది కలిగించేలా వ్యవహరించలేదని అన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల ముందు జగన్ తన కార్యాలయానికి పిలిపించుకుని పామర్రు అభ్యర్థిని గెలిపించమని కోరారని చెప్పారు. నియోజకవర్గ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌ తనను ఏ కార్యక్రమానికి ఆహ్వానించకపోయినప్పటికీ.. తాను అధిష్టానానికి ఫిర్యాదు చేయలదేని చెప్పారు. 

ఇక, పామర్రు ఎస్సీ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 2009లో జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచిన డీవై దాసు విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో అక్కడి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఉప్పులేటి కల్పన విజయం సాధించారు. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో ఆమె టీడీపీలో చేరారు. 2019 ఎన్నికలకు ముందు ఆయన జనసేన టికెట్ ఆశించారు. అయితే ఫలితం లేకపోవడంతో జనసేనకు రాజీనామా చేసి.. వైసీపీ కండువా కప్పుకున్నారు. అయితే  2019 ఎన్నికల్లో పామర్రు నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన కైలే అనిల్ కుమార్ విజయం సాధించారు. 


ఇదిలా ఉంటే.. ఇటీవల గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ‌ను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ వైసీపీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రావి వెంకటరమణ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని సస్పెండ్ చేసినట్టుగా తెలిపింది. 10 రోజుల వ్యవధిలోనే ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో.. ఇకా వైసీపీ అధిష్టానం హిట్ లిస్ట్‌లో ఎవరున్నారనే చర్చ వైసీసీ వర్గాల్లో సాగుతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios