తనకు టికెట్ దక్కకపోవడంపై నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత బొల్లినేని రామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. టిడిపిలో బ్రోకర్లు రాజ్యమేలుతున్నారని.. రియల్ ఎస్టేట్ వ్యాపారం లాగా బ్రోకర్‌లు టిక్కెట్లు ఇప్పిస్తున్నారని మండిపడ్డారు.
టీడీపీ జనసేన తొలి జాబితా రాష్ట్రవ్యాప్తంగా ఇరుపార్టీల నేతల్లో అసంతృప్తికి కారణమైంది. టికెట్ దక్కని నేతల్లో కొందరు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తుండగా.. మరికొందరిని పెద్దలు కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి , టీడీపీ సీనియర్ నేత గొల్లపల్లి సూర్యారావు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. ఈ క్రమంలో నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత బొల్లినేని రామారావు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కలిగిరిలో అభిమానులు, కార్యకర్తలతో రామారావు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఎన్నారై కాకర్ల సురేష్‌కు అభ్యర్ధిగా అవకాశం ఇవ్వడంపట్ల అభ్యంతరం వస్తున్నారు రామారావు.
టీడీపీ అభ్యర్థిగా తమకు అన్యాయం జరిగిందంటూ అనుచరుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయగిరి అభ్యర్థి విషయంలో చంద్రబాబు నిర్ణయం చూసి కలత చెందానని బొల్లినేని రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. తనకు టికెట్టు రావడంలేదని తెలిసి చంద్రబాబును అపాయింట్‌మెంట్ అడిగినా ఇవ్వలేదని.. ఆత్మీయ సమావేశంలో భోరున విలపించారు బొల్లినేని. పార్టీ కష్టకాలంలో అండగా నిలబడ్డానని.. టిక్కెట్టు రానందుకు బాధగా లేదన్నారు. చంద్రబాబు చేసిన విధానం నన్ను కలచిచేసింది.
కార్యకర్తల నిర్ణయానికి కట్టుబడి ఉంటానని .. ఉదయగిరిలో తప్పకుండా పోటీ చేస్తానని రామారావు తెలిపారు. చివరిగా చంద్రబాబుని కలుస్తానని.. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా పోటీ చేస్తానని తేల్చిచెప్పారు. టిడిపిలో బ్రోకర్లు రాజ్యమేలుతున్నారని.. రియల్ ఎస్టేట్ వ్యాపారం లాగా బ్రోకర్‌లు టిక్కెట్లు ఇప్పిస్తున్నారని మండిపడ్డారు.
