రాష్ట్ర విభజన చేసి.. ఏపీలో తన గుర్తింపును పూర్తిగా కోల్పోయింది కాంగ్రెస్. గత ఎన్నికల్లో పత్తా లేకుండా పోయింది. దీంతో.. వచ్చే  ఎన్నికల నాటికి తిరిగి ఏపీలో తమ బలాన్ని పెంచుకోవడానికి  నానా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే.. కిరణ్ కుమార్ రెడ్డిని తిరిగి పార్టీలోకి ఆహ్వానించారు. కిరణ్ కుమార్ రెడ్డి  పార్టీలోకి అడుగుపెట్టాక.. పార్టీ నేతలకు కొత్త ఉత్సాహం వచ్చింది.

ఇక.. కీలక నేతలందరినీ పార్టీలోకి తిరిగి తీసుకువచ్చే బాధ్యత కిరణ్ తన భుజాలపై వేసుకున్నారు. ఇందులో భాగంగానే తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే అశోక్ బాబుపై దృష్టిసారించారు.

గతంలో విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరిగిన సమయంలో ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీ ఎన్నికల బాధ్యతలను అశోక్‌బాబుకే అప్పగించారు. నీలం తుఫాను సంభవించినపుడు సైతం కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తుని వచ్చి అశోక్‌బాబుపై ప్రశంసల వర్షం కురిపిస్తూనే రూ.100కోట్లను తుపాను సహాయక నిధులుగా అందజేశారు. 

దీంతో అప్పటి స్నేహాన్ని కిరణ్‌కుమార్‌రెడ్డి ఇపుడు తునిలో పార్టీ బలోపేతానికి ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కిరణ్‌ అశోక్‌కు ఫోన్‌ చేసి ఓసారి కలవాలని కోరినట్లు సమాచారం. రాష్ట్ర విభజన తర్వాత పార్టీ కి దూరమైన అశోక్ బాబు.. వైసీపీ లేదా జనసేనలో చేరాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే.. కిరణ్ కుమార్ రెడ్డి నుంచి ఫోన్ రావడంతో ఆయన ఆలోచనలో పడినట్లు సమాచారం. కిరణ్ కుమార్ రెడ్డితో భేటీ అయితే కనుక కచ్చితంగా అశోక్ బాబు కాంగ్రెస్ లో మళ్లీ చేరే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయని పార్టీ నేతలు భావిస్తున్నారు.