జగన్ ప్రభుత్వంపై మాజీ మంత్రి  యనమల విరుచుకుపడ్డారు. ప్రజా ప్రభుత్వం పోయి ఫాసిస్ట్ ప్రభుత్వం వచ్చిందని ఆయన అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన జగన్ పై విమర్శలు చేశారు.

 రాష్టాభివృద్ది, పేదల సంక్షేమం కోసం టీడీపీ ప్రభుత్వం పని చేసిందన్నారు. అభివృద్దిని దెబ్బతీసేలా, సంక్షేమాన్ని కుంటుపరిచేలా వైసీపీ ప్రభుత్వం పని చేస్తోందని మాజీ మంత్రి చెప్పుకొచ్చారు. ప్రతిపక్షాల మీద దాడులు చేయడమే వైసీపీ ప్రభుత్వ ప్రధాన ధ్యేయంగా పెట్టుకుందని మండిపడ్డారు. 

అన్నం ఉడికిందో లేదో తెలీడానికి ఒక్క మెతుకు పట్టుకొని చూస్తే సరిపోతుందని యనమల అన్నారు. నెల రోజుల్లోనే వైసీపీ ప్రభుత్వ అసమర్ధత, అరాచకం బయటపడిందని చెప్పారు. ఈ ఖరీఫ్‌లో తీవ్ర వర్షాభావం, కరవు పరిస్థితి ఉందన్నారు. అలాంటిది డ్రాట్ మిటిగెంట్ ప్లాన్‌పై కసరత్తే లేదని.. విత్తనాలు అందక రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారన్న విషయం ఈ సందర్భంగా యనమల గుర్తు చేశారు.

సమస్యల్లో ఉన్న రైతులను ఆదుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదని అభిప్రాయపడ్డారు. రైతులకు విత్తనాలు పంపిణీ చేయడానికి రూ.380కోట్లు కూడా ఇవ్వలేని జగన్... వేల కోట్ల హామీలను ఎలా నెరవేరుస్తారని ప్రశ్నించారు. పేదల సమస్యలపై పోరాటమే ప్రతిపక్షంగా తమ విధి అన్నారు.

 ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొనే సత్తా టీడీపీకి ఉందన్నారు.  మా భవనాలు కూలగొడితేనో, పేదల ఇళ్లు కూల్చితేనో, మీరు గొప్పవాళ్లు కాలేరన్నారు.  సమాజంలో నిర్మాణమే తప్ప కూల్చివేతను ఎవరూ హర్షించరని గుర్తు చేశారు.  ప్రజలకు మేలు చేసే ఉద్దేశం మీలో మచ్చుకి కూడా లేదా అని ప్రశ్నించారు.  కక్ష సాధింపు ఆపేయాలని.. బురద జల్లడం మానుకోవాలని సూచించారు.