అమరావతి: మాజీమంత్రి రావెల కిషోర్ బాబు భారతీయ జనతా పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. శనివారం ఉదయం జనసేన పార్టీకి రాజీనామా చేసిన రావెల కిషోర్ బాబు ఆ తర్వాత బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 

అందులో భాగంగా ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. బీజేపీలో చేరే అంశంపై ఇరువు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు.  

తర్వాత చంద్రబాబు కేబినెట్ లో సాంఘీక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కేబినెట్ విస్తరణలో పదవిని పోగొట్టుకున్నారు. మంత్రి పదవిని కోల్పోయినప్పటి  నుంచి టీడీపీతో అంటీముట్టనట్లుగానే వ్యవహరించారు. 

అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి జనసేన పార్టీలో చేరిపోయారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకతోటి సుచరిత చేతిలో ఘోరంగా ఓటమి చెందారు. 

ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయన కాస్త సైలెంట్ గా ఉన్నారు. ఎన్నికల్లో ఓటమిపై జీర్ణించుకోలేకపోయిన ఆయన పవన్ కళ్యాణ్ సమీక్షలకు హాజరుకాలేదు. ఇక శనివారం ఉదయం జనసేన పార్టీకి గుడ్ బై చెప్పేశారు. అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో భేటీ అయ్యారు. ఇక త్వరలో బీజేపీ గూటికి చేరనున్నారన్నమాట.