చిలకలూరిపేటలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మరణించిన ఘటనపై టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కల్తీ మద్యం సేవించడం వల్లే వారిద్దరూ ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు.
చిలకలూరి పేటలో (chilakaluripet) నాసిరకం మద్యం (adulterated liquor) తాగడం వల్లే ఇద్దరు చనిపోయారని ఆరోపించారు మాజీ మంత్రి, టీడీపీ (tdp) నేత పత్తిపాటి పుల్లారావు (prathipati pulla rao) . మద్యం తాగడం వల్లే రెండు గంటల్లోపే చనిపోయారని ఆయన అన్నారు. మృతులకు హాడావుడిగా పోస్ట్‌మార్టం చేయించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రత్తిపాటి ప్రశ్నించారు. డబ్బులు ఇస్తామని మభ్యపెట్టి.. ఈ సంఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోందని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రత్తిపాటి. కల్తీ మద్యం శాంపిళ్లను ల్యాబ్‌కి పంపించి. నివేదికలు తెప్పించి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలని పుల్లారావు డిమాండ్ చేశారు.
కాగా.. చిలకలూరిపేటలోని సూదివారిపాలేనికి చెందిన షేక్ మస్తాన్ షరీఫ్ (55), సయ్యద్ బషీర్ మహమ్మద్ (35) స్నేహితులు. మస్తాన్ రోజువారీ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బషీర్ మహమ్మద్ కూలి పనులు చేస్తుండడంతోపాటు అప్పుడప్పుడూ లారీ డ్రైవర్‌గా వెళ్తుండేవాడు. ఈ క్రమంలో వీరిద్దరూ గత మూడు రోజుల నుంచి మద్యం సేవిస్తున్నారు. స్థానిక కృష్ణమహల్ సెంటర్‌లోని ప్రభుత్వ మద్యం దుకాణంలో సోమవారం కూడా మద్యం కొనుగోలు చేసి తాగారు.
అయితే మధ్యాహ్నం 12 గంటలు దాటిన తర్వాత అదే సెంటర్‌లో వీరిద్దరూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. స్థానికులు హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. వీరు మద్యం తాగడం వల్లే చనిపోయారా?, వడదెబ్బ ఏమైనా తగిలిందా? ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక కారణాలు తెలుస్తాయని చెప్తున్నారు.
