పల్నాడు టీడీపీలో మరో చిచ్చు : చిలకలూరిపేట బరిలో కొత్త పేరు .. కోటి ఇస్తే ప్రోత్సహిస్తారా, పుల్లారావు ఆగ్రహం
పల్నాడు జిల్లాకే చెందిన మరో కీలక నేత, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు సైతం టీడీపీ అధిష్టానంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఫౌండేషన్, ట్రస్టుల పేర్లతో వచ్చే వారిని ఎంటర్‌టైన్ చేస్తే ఎలా అని ప్రశ్నించారు.

గుంటూరు జిల్లా చిలకలూరిపేట టీడీపీలో చిచ్చు రేగింది. ఇప్పటికే సత్తెనపల్లి టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను నియమించడంపై దివంగత స్పీకర్ కోడెల శివప్రసాద్ తనయుడు శివరాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అధిష్టానం తీరును తప్పుబడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో శివరాంను బుజ్జగించేందుకు హైకమాండ్ రంగంలోకి దిగింది. ఇదిలావుండగా.. పల్నాడు జిల్లాకే చెందిన మరో కీలక నేత, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు సైతం అధిష్టానంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
చిలకలూరిపేట టీడీపీ అభ్యర్ధిగా గత కొంతకాలం నుంచి భాష్యం ప్రవీణ్ పేరు వినిపిస్తోంది. నిజానికి చిలకలూరిపేట పుల్లారావుకు కంచుకోట. గతంలో పలుమార్లు ఎమ్మెల్యేగా ఆయన ఇక్కడి నుంచే గెలుపొందారు. గత ఎన్నికల్లో తన శిష్యురాలు విడదల రజనీ చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి పుల్లారావు నియోజకవర్గానికి దూరంగా హైదరాబాద్‌లోనే గడుపుతున్నారంటూ ప్రచారం జరిగింది. అందుకే ఈసారి హైకమాండ్ భాష్యం ప్రవీణ్‌ను రంగంలోకి దించిందంటూ ఊహాగానాలు వినిపించాయి.
Also Read: చెప్పాల్సిదంతా చెప్పా, పార్టీ నిర్ణయం కోసం వేచి చూస్తా: కోడెల శివరాం
ఈ నేపథ్యంలో పుల్లారావు స్పందించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసలు చిలకలూరిపేటకు భాష్యం ప్రవీణ్‌కు సంబంధం ఏంటీ అని ప్రశ్నించారు. అతనికి ఇక్కడ కనీసం ఓటు హక్కు కూడా లేదని పుల్లారావు దుయ్యబట్టారు. ఫౌండేషన్, ట్రస్టుల పేర్లతో వచ్చే వారిని ఎంటర్‌టైన్ చేస్తే ఎలా అని ప్రశ్నించారు. ఇప్పుడెదో రూ.కోటితో హడావుడి చేస్తారని.. తర్వాత చేతులెత్తేస్తారని పత్తిపాటి ఆరోపించారు.
పార్టీని పట్టించుకోకుండా సీనియర్లు తిరుగుతున్నారంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడో పది వేలు, ఇక్కడో రూ.10 వేలు ఖర్చు పెట్టేవారికి టికెట్లు ఇచ్చేస్తారంటూ ఆయన మండిపడ్డారు. కోడెల శివరాం ఇష్యూపై స్పందిస్తూ.. ఆ కుటుంబానికి న్యాయం చేయాలని పుల్లారావు డిమాండ్ చేశారు. ప్రజల్లో వున్న నేతలకు, గెలుస్తామనే నేతలకే టికెట్లు ఇవ్వాలని ఆయన కోరారు. అన్ని విషయాలు పార్టీ పెద్దలకు చెప్పానని .. రూ.కోటి ఇస్తే ప్రోత్సహిచ్చేస్తారా అంటూ పత్తిపాటి దుయ్యబట్టారు.