మంత్రి విడదల రజనీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు. మీరు ఎక్కడ విందు వినోదాలు చేసుకున్నారో.. మాకు తెలియదని, అలాంటి విషయాలలోకి మమ్మల్ని లాగొద్దని ఆయన హితవు పలికారు. మంత్రితో తన కుటుంబ సభ్యులు కలిసి వున్నట్లుగా ఆధారాలు చూపించాలని ఆయన సవాల్ విసిరారు.  

తన కుటుంబ సభ్యులు మంత్రి విడదల రజనీతో (vidadala rajini) కలిసి ఉన్న ఆధారాలు చూపెడితే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు (prathipati pulla rao) . దీనిపై మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... చిలకలూరిపేట ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి విడదల రజినీ తెలుగుదేశం పార్టీలో (telugu desam party) చేరకముందు ఎవరికైనా తెలుసానని పుల్లారావు ప్రశ్నించారు. టీడీపీలో ఎలా చేరారో, చంద్రబాబు నాయుడుతో (chandrababu naidu) ఏవిధంగా మహానాడు వేదికను పంచుకున్నారో తెలుసా ఆయన వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీలో గుర్తింపు తెచ్చుకుని... ఇక్కడి నాయకులతో సన్నిహిత సంబంధాలు పెట్టుకొని అదే నాయకులతో ఒక కుట్ర ప్రకారం పథకం పన్ని రాజకీయం చేసి వైసీపీ లోకి వెళ్లి సీటు తెచ్చుకుని నమ్మక ద్రోహం చేసి గెలిచారని మంత్రి విడదల రజనీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

ఇంత చేసినా ఇప్పటికి మా కుటుంబం పేరు గానీ, మా పార్టీ పేరు గాని తలవనిదే మీకు నిద్ర పట్టడం లేదా అని పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టాక అయినా హుందాగా మెలగడం నేర్చుకోవాలని.. చిల్లర రాజకీయాలు చేయ్యొద్దంటూ ప్రత్తిపాటి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీరు ఎక్కడ విందు వినోదాలు చేసుకున్నారో.. మాకు తెలియదని, అలాంటి విషయాలలోకి మమ్మల్ని లాగొద్దని ఆయన హెచ్చరించారు. మీకు తెలియకుండానే సదరు వార్తా సంస్థ యాజమాన్యం దుష్ప్రచారం చేసి ఉంటే ఆ సంస్థపై దమ్ముంటే చర్యలు తీసుకోవాలని పుల్లారావు సవాల్ విసిరారు. 

అంతకుముందు చిలకలూరి పేటలో (chilakaluripet) నాసిరకం మద్యం (adulterated liquor) తాగడం వల్లే ఇద్దరు చనిపోయారని ఆరోపించారు పత్తిపాటి పుల్లారావు . మద్యం తాగడం వల్లే రెండు గంటల్లోపే చనిపోయారని ఆయన అన్నారు. మృతులకు హాడావుడిగా పోస్ట్‌మార్టం చేయించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రత్తిపాటి ప్రశ్నించారు. డబ్బులు ఇస్తామని మభ్యపెట్టి.. ఈ సంఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోందని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రత్తిపాటి. కల్తీ మద్యం శాంపిళ్లను ల్యాబ్‌కి పంపించి. నివేదికలు తెప్పించి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలని పుల్లారావు డిమాండ్ చేశారు. 

"