కృష్ణపట్నం కోసమే బందర్ పోర్ట్ పనుల్ని పక్కనబెట్టారని ఆరోపించారు మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని. జగన్ ప్రభుత్వంలో బండలేసి వదిలేయడం జాన్తానై అన్నారు. 2014 నుంచి 2019 వరకు బందరు పోర్టును ఏ మేరకు నిర్మాణం చేశారో చెప్పాలని పేర్ని నాని విమర్శించారు.
బందరు పోర్టు గురించి టీడీపీ నేతలు విచిత్ర ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2014 నుంచి 2019 వరకు బందరు పోర్టును ఏ మేరకు నిర్మాణం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. బందరు పోర్టు విషయంలో వైసీపీని విమర్శించే ముందు కొల్లు రవీంద్ర తన అంతరాత్మను ప్రశ్నించుకోవాలని నాని చురకలంటించారు. ఓ శంకుస్థాపన రాయి వేస్తే పోర్టు నిర్మాణం చేసినట్టేనా అని పేర్ని నాని ప్రశ్నించారు.
గత ప్రభుత్వం హయాంలో టెండర్లు చేజిక్కించుకున్న నవయుగ సంస్థ శంకుస్థాపన చేసి 8 నెలలైనా కూడా పార మట్టి పని కూడా చేయలేని ఆయన దుయ్యబట్టారు. అప్పట్లో నవయుగ పరిధిలో ఉన్న కృష్ణపట్నం పోర్టు వ్యాపారం తగ్గకుండా ఉండేందుకు నాడు బందరు పోర్టు నిర్మాణ పనులు ఆ కంపెనీ చేపట్టలేదని పేర్నినాని ఆరోపించారు. జనవరి నెలలో శంకుస్థాపన చేయనున్నామని.. టీడీపీ తరహాలో శంకుస్థాపన బండ పడేసి వదిలేయమని, పనులు చేపడతామని ఆయన స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వంలో బండలేసి వదిలేయడం జాన్తానై అన్న పేర్ని నాని.. బందరు పోర్టు నిర్మాణానికి అవసరానికి మించి భూములు తీసుకుని ఊళ్లను ఖాళీ చేయించడాన్నే తాము అడ్డుకున్నామని ఆయన పేర్కొన్నారు.
ALso REad:దాడులు చేసినొళ్లకి మద్ధతుగా తీర్మానాలా : జనసేన పీఏసీ సమావేశంపై పేర్ని నాని విమర్శలు
అంతకుముందు అక్టోబర్ 30న పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. ముందస్తు అనుమతి తీసుకోకుండా విశాఖలో పవన్ ర్యాలీ చేశారని.. మంత్రులపై దాడి చేసినందుకు పవన్‌ను చంద్రబాబు పరామర్శించారా అని ఆయన సెటైర్లు వేశారు. చంద్రబాబు కోసం పవన్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని పేర్ని నాని ఎద్దేవా చేశారు. ముద్రగడపై దాడి సమయంలో పవన్ ఎందుకు ప్రశ్నించలేదని ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబుకు రాజకీయం అవసరం వచ్చినప్పుడల్లా పవన్ విమర్శలు చేస్తున్నారని పేర్నినాని ఎద్దేవా చేశారు. పవన్ పోరాటం చేయకుండా లాలూచీ పడుతున్నారని ఆయన చురకలు వేశారు.
దేశంలోని చిన్న పార్టీ అయినా, జాతీయ స్థాయి పార్టీ అయినా పీఏసీ సమావేశం నిర్వహించినప్పుడు ప్రజలకు మేలు చేసే పనులపై మాట్లాడుతాయన్నారు. కానీ జనసేన తీరు కొండను తవ్వి ఎలుకను పట్టిన చందాన వుందన్నారు. వారం క్రితం చేసిన తీర్మానాలనే కాపీ చేసి తీసుకొచ్చారని పేర్ని నాని విమర్శించారు. ప్రజల్లో సానుభూతి కోసం జనసేన తప్పుడు ప్రచారం చేస్తోందని.. మంత్రులపై దాడి చేయడాన్ని పవన్ కనీసం ఖండించలేదని ఆయన ఫైర్ అయ్యారు.
