జనసేన పార్టీ పీఏసీ సమావేశంపై విమర్శలు చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. అరాచకం సృష్టించిన వారిని అభినందిస్తూ తీర్మానం చేశారని ఆయన దుయ్యబట్టారు. పవన్ పోరాటం చేయకుండా లాలూచీ పడుతున్నారని నాని చురకలు వేశారు. 

తుని ఘటనలో కేసులు ఎత్తివేసింది వైసీపీనే అన్నారు మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అంబేద్కర్ పేరుకు మద్ధతు పలికి తర్వాత మాట మార్చారని నాని దుయ్యబట్టారు. మంత్రి ఇంటిపై దాడి చేసిన వారిలో మీ కార్యకర్తలు లేరా అని ఆయన ప్రశ్నించారు. అరాచకం సృష్టించిన వారిని అభినందిస్తూ తీర్మానం చేశారని.. మహిళలపై దాడులు చేసే వారికి మద్ధతిస్తూ తీర్మానం చేస్తారా అంటూ పేర్ని నాని నిలదీశారు. 

ముందస్తు అనుమతి తీసుకోకుండా విశాఖలో పవన్ ర్యాలీ చేశారని.. మంత్రులపై దాడి చేసినందుకు పవన్‌ను చంద్రబాబు పరామర్శించారా అని ఆయన సెటైర్లు వేశారు. చంద్రబాబు కోసం పవన్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని పేర్ని నాని ఎద్దేవా చేశారు. ముద్రగడపై దాడి సమయంలో పవన్ ఎందుకు ప్రశ్నించలేదని ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబుకు రాజకీయం అవసరం వచ్చినప్పుడల్లా పవన్ విమర్శలు చేస్తున్నారని పేర్నినాని ఎద్దేవా చేశారు. పవన్ పోరాటం చేయకుండా లాలూచీ పడుతున్నారని ఆయన చురకలు వేశారు. 

దేశంలోని చిన్న పార్టీ అయినా, జాతీయ స్థాయి పార్టీ అయినా పీఏసీ సమావేశం నిర్వహించినప్పుడు ప్రజలకు మేలు చేసే పనులపై మాట్లాడుతాయన్నారు. కానీ జనసేన తీరు కొండను తవ్వి ఎలుకను పట్టిన చందాన వుందన్నారు. వారం క్రితం చేసిన తీర్మానాలనే కాపీ చేసి తీసుకొచ్చారని పేర్ని నాని విమర్శించారు. ప్రజల్లో సానుభూతి కోసం జనసేన తప్పుడు ప్రచారం చేస్తోందని.. మంత్రులపై దాడి చేయడాన్ని పవన్ కనీసం ఖండించలేదని ఆయన ఫైర్ అయ్యారు. 

Also Read:జనసైనికులను ఇబ్బంది పెట్టేలా వైసీపీ ప్రభుత్వం కుట్రలు.. ప్రజాస్వామ్య పరిరక్షణకు నడుం కట్టాలి: నాదెండ్ల మనోహర్

అంతకుముందు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. జనసైనికులను ఇబ్బంది పెట్టేలా వైసీపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆరోపించారు. ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహన్, పీఏసీ సభ్యులు హాజరయ్యారు. 

ఈ సమావేశంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. విశాఖపట్నంలో జరిగిన ఘటనను రాష్ట్రం మొత్తం చూసిందని అన్నారు. వైసీపీ ప్రభుత్వ దాష్టికాలను జనసేన నాయకులు ఎదుర్కొన్న తీరు అభినంద‌నీయమని అన్నారు. పవన్ కల్యాన్ వారికి అండగా నిలబడి భరోసా ఇచ్చారని చెప్పారు. భవిష్యత్‌లో ప్రజాస్వామ్య పరిరక్షణకు నడుం కట్టాలని పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వ అరాచకాలు, అవినీతిపై పోరాటం సాగించాలని కోరారు. ఈ సమావేశం అనంతరం పవన్ కల్యాణ్.. సాయంత్రం 4 గంటలకు మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.