ఉమ్మడి కృష్ణా జిల్లా జడ్పీ సమావేశానికి ఏలూరు జిల్లా కలెక్టర్ గైర్హాజరు కావడంపై వివాదం మరింత ముదురుతోంది. దీనిపై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి మాజీ మంత్రి పేర్ని నాని గురువారం ఫిర్యాదు చేశారు.
బుధవారం జరిగిన ఉమ్మడి కృష్ణా జిల్లా జడ్పీ సమావేశానికి ఏలూరు జిల్లా కలెక్టర్ గైర్హాజరు కావడం వివాదాస్పదమైంది. దీనిపై మాజీ మంత్రి , మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరు కలెక్టర్, అధికారులు ఈసారి సమావేశానికి రాకుంటే నేరుగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు బైఠాయిస్తానని పేర్ని నాని హెచ్చరించారు. అంతేకాదు.. ఏలూరు కలెక్టర్‌కు లేఖ రాయాల్సిందిగా జడ్పీ ఛైర్‌పర్సన్ ఉప్పాల హారికకు ఆయన సూచించారు.
ALso Read: ఇలాగైతే సీఎం జగన్ ఇంటిముందే ఆందోళనకు దిగుతాం..: పేర్ని నాని సీరియస్ (వీడియో)
ఈ క్రమంలో గురువారం సీఎస్ జవహర్ రెడ్డితో పేర్ని నాని భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఏలూరు కలెక్టర్‌పై ఆయన ఫిర్యాదు చేశారు. అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి కృష్ణా జిల్లా ఒక్కటే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లు జడ్పీ సమావేశానికి రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని సీఎస్ దృష్టికి తీసుకెళ్లాలని.. దీనిపై చీఫ్ సెక్రటరీ స్పందించారని నాని తెలిపారు. తనకు ఏలూరు కలెక్టర్‌తో వ్యక్తిగతంగా ఎలాంటి గొడవలు లేవని ఆయన తేల్చిచెప్పారు. ప్రభుత్వాధికారులు రాజ్యాంగం ఏర్పాటు చేసిన వ్యవస్ధలను నాశనం చేయకూడదని నాని చురకలంటించారు. కలెక్టర్లు సమావేశానికి రాకుంటే ఎంపీపీలు, జడ్‌పీటీసీలు అడిగే ప్రశ్నలకు ఎవరు సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు.
