Asianet News TeluguAsianet News Telugu

నందమూరి వారసులంటే చంద్రబాబుకు భయం.. లోకేష్‌వన్ని అబద్ధాలే : పేర్ని నాని చురకలు

కుప్పం సభలో సీఎం జగన్ , వైసీపీ నేతలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన  వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మాజీ మంత్రి పేర్ని నాని. నందమూరి వారసులను చూసి చంద్రబాబు భయపడుతున్నారని.. పిట్టల దొరకు లోకేష్‌కు తేడా కనిపించడం లేదని పేర్ని నాని సెటైర్లు వేశారు. 

ex minister perni nani counter to tdp leader nara lokesh
Author
First Published Jan 27, 2023, 9:27 PM IST

నందమూరి వారసులను చూసి చంద్రబాబు భయపడుతున్నారని దుయ్యబట్టారు మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లోకేష్, చంద్రబాబు చెప్పే మాటలను జనం నమ్మరని అన్నారు. చంద్రబాబు చెత్త నాయకుడని అచ్చెన్నాయుడే చెబుతున్నారని పేర్ని నాని చురకలంటించారు. కుప్పం సభలో లోకేష్ బరితెగించి అసత్యాలు మాట్లాడారని ఎద్దేవా చేశారు. లోకేష్ యాత్ర ప్రాయోజిత కార్యక్రమమని ఆయన ఆరోపించారు. చంద్రబాబు మంచి పనులు చేస్తే లోకేష్ ఎందుకు బజారున పడ్డారని పేర్నినాని ప్రశ్నించారు. తెలుగుదేశాన్ని ప్రజలు ఎందుకు చిత్తుగా ఓడించారని ఆయన నిలదీశారు. 

పెన్షన్లు తీసేశారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. చంద్రబాబు హయాంలో 40 లక్షల పెన్షన్లు వుంటే.. జగన్ హయాంలో 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నారని నాని తెలిపారు. కొత్త వైన్ బ్రాండులన్నీ చంద్రబాబు హయాంలో వచ్చినవేనని ఆయన ఆరోపించారు. చంద్రబాబు పెట్టిన ధాన్యం బకాయిలను తమ ప్రభుత్వం చెల్లించిందని పేర్ని నాని తెలిపారు. చంద్రబాబు పెట్టిన 22 వేల కోట్ల కరెంట్ బకాయిల భారాన్ని ప్రజలు మోస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు వంద అబద్ధాలు చెబితే.. లోకేష్ వెయ్యి చెబుతున్నారని పేర్నినాని ఆరోపించారు. జన్మభూమి కమిటీలను మళ్లీ తెస్తామని చెప్పే దమ్ముందా అని ఆయన ప్రశ్నించారు. 

ALso REad: కుప్పంలో యువగళం: పాదయాత్రను ప్రారంభించిన నారా లోకేష్

తెలుగు గంగను పూర్తి చేస్తామని చెప్పడానికి సిగ్గులేదా అని పేర్నినాని దుయ్యబట్టారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. మీరు ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా జగన్‌ను మిల్లీమీటర్ కూడా కదపలేరని పేర్ని నాని స్పష్టం చేశారు. సీఎం జగన్ వల్ల చంద్రబాబు, లోకేష్‌ల ఉద్యోగాలే పోయాయని ఆయన చురకలంటించారు. పిట్టల దొరకు లోకేష్‌కు తేడా కనిపించడం లేదని పేర్ని నాని సెటైర్లు వేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios