అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తెలుగుదేశం పార్టీకి పలువురు దూరమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరగా.. పలువురు ఇంకా క్యూలో ఉన్నారు.

ఈ క్రమంలో ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య టీడీపీకి రాజీనామా చేశారు. చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన సుబ్బయ్య మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్లలో మంత్రిగా పనిచేశారు.

వ్యక్తిగత కారణాలతో పాటు కుటుంబ పరిస్థితులే తన రాజీనామాకు కారణమని తెలుపుతూ టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో సుబ్బయ్య పేర్కొన్నారు. ఈ లేఖను జిల్లా పార్టీ అధ్యక్షుడు పులవర్తి నానికి, జాతీయాధ్యక్షుడు చంద్రబాబుకు ఈ మెయిల్ ద్వారా పంపారు.