అనంతపురం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనంతపురం జిల్లాలో రాజకీయ దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని ఆరోపించారు మాజీమంత్రి పరిటాల సునీత. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమపై అకారణంగా దాడి చేస్తున్నారని ఆరోపిస్తూ అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. 

మాజీమంత్రులు పరిటాల సునీత, కాలువ శ్రీనివాసులు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పార్థసారథితో కలిసి ఎస్పీ సత్య యేసుబాబుకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం తమ పార్టీ నేతలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని విజ్ఞప్తి చేశారు. 

అధికారంలోకి వచ్చి ఇంకా నెల రోజులు కూడా గడవకముందే వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. గ్రామాల్లో రెచ్చగొట్టే దోరణితో వ్యవహరిస్తూ తమ పార్టీ నేతలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు.  

మరోవైపు తన భర్త పరిటాల రవీంద్ర ట్రస్టు పేరుతో నిర్మించిన వాటర్ ప్లాంట్లను వైసీపీ నేతలు ధ్వంసం చేస్తున్నారని మాజీ మంత్రి పరిటాల సునీత ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ధ్వంసం చేయడం, అకారణంగా దాడులు చేయడం సరికాదంటూ పరిటాల సునీత సూచించారు.