నెల్లూరు జిల్లాలో 10కి పది గెలుస్తాం .. జనసేనకు ఏ సీటిస్తారో చంద్రబాబు ఇష్టం : నారాయణ వ్యాఖ్యలు
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పదికి పది అసెంబ్లీ స్థానాలను గెలుస్తామన్నారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నారాయణ. సీట్ల సర్దుబాటు అంశం చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు చర్చించుకుంటారని నారాయణ పేర్కొన్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పదికి పది అసెంబ్లీ స్థానాలను గెలుస్తామన్నారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నారాయణ. మంగళవారం చంద్రబాబు నాయుడుతో సమావేశమైన ఆయన.. త్వరలో టీడీపీ అధినేత నెల్లూరు పర్యటనపై చర్చించారు. అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లాలో వైసీపీకి నేతలే లేరని, మార్చి 2న జరిగే చంద్రబాబు సభలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరుతారని తెలిపారు.
సీట్ల సర్దుబాటు అంశం చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు చర్చించుకుంటారని నారాయణ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో జనసేనకు ఏ సీటు కేటాయిస్తారో తనకు తెలియదని, ఈ విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పాటిస్తామని ఆయన స్పష్టం చేశారు. పొత్తు విషయంలో బీజేపీతోనూ చర్చలు జరుగుతున్నాయని.. త్వరలోనే దీనిపై చంద్రబాబు క్లారిటీ ఇస్తారని నారాయణ చెప్పారు.
ఇకపోతే.. మార్చి 2న నెల్లూరులోని వీపీఆర్ కన్వెన్షన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు టీడీపీ భారీ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఇదే సమావేశంలో వైసీపీ రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డి టీడీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు. వారితో పాటు పలువురు జెడ్పీటీసీలు , ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, కార్పోరేటర్లు, వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీలో చేరుతారని నారాయణ పేర్కొన్నారు.