అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీమంత్రి నారా లోకేష్. ఏపీ అసెంబ్లీలో చంద్రబాబుపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే రాజకీయమే కాదని ఇతరులకు ఆదర్శంగా ఉండాలని సూచించారు. 

చంద్రబాబు ఎందులో ఆదర్శంగా ఉన్నారో చెప్పాలంటూ జగన్ ప్రశ్నించారు. జగన్ వ్యాఖ్యలపై స్పందించిన లోకేష్ ఎందులో ఆదర్శం అని చంద్రబాబుని మీరు అడిగారంటే అది మీ అజ్ఞానమో, అమాయకత్వమో అర్థం కావడం లేదంటూ విమర్శించారు. 

ఉమ్మడి రాష్ట్రంలో దేశంలోనే మొదటిసారిగా విద్యుత్ సంస్కరణలను చేపట్టి నష్టాల్లో ఉన్న సంస్థలను గట్టెక్కించి ఆదర్శంగా నిలిచింది చంద్రబాబు అంటూ చెప్పుకొచ్చారు. చంద్రబాబు కష్టాన్నే మీ నాయన ఉచిత విద్యుత్తు అంటూ సోకుచేసుకున్నారని మండిపడ్డారు. 

అంతేకాదు 2009 ఎన్నికలకి ముందు యూనిట్ విద్యుత్తును రూ.16కి కొనిపించి డిస్కంలకు రూ.6,600 బకాయి పెట్టి సంస్థలను దివాళా తీయించిన ఘనత మీ తండ్రి వైయస్ఆర్ దేనని ఆరోపించారు. 

విద్యుత్ సంస్థలకు మీ తండ్రి వైయస్ఆర్ పెట్టిన కన్నాన్ని పూడ్చేటందుకు 2015లో ఉదయ్ పథకాన్ని ఉపయోగించుకుని రూ.8,892 కోట్ల నష్టాలను సరిచేసే ప్రయత్నం చేసినట్లు తెలిపారు. 2015-16లో రూ.4.63కపైసలకు కొన్న విద్యుత్తును 2018-19లో రూ.2.72 పైసలకు కొంటున్నట్లు చెప్పుకొచ్చారు. 

ఇది చెప్పకుండా పాతధరల మీదే ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని నిలదీశారు. అయినా విద్యుత్తును ఎక్కువ ధరపెట్టి కొనుగోలు చేస్తున్నాం, ప్రజాధనం వృద్ధా అయిపోతుందని సుద్దపూస కబుర్లు చెప్పే సీఎం జగన్ సొంత సంస్థ అయిన సండూర్ పవర్ నుంచి కర్ణాటకలో హెస్కామ్ కు రూ.4.50కి ఎందుకు అమ్ముతోందని ప్రశ్నించారు. 

మీ జేబులో వేసుకునేటప్పుడు అది ప్రజాధనం అని గుర్తుకు రాదా? అని నిలదీశారు. థర్మల్ పవర్ చీప్ కదా ఎందుకు వాడుకోకూడదు అని వాదిస్తున్న మీ తెలివితేటలకు నవ్వొస్తోందని ఎద్దేవా చేశారు. ప్రపంచం మొత్తం క్లీన్ ఎనర్జీ వైపు మళ్ళుతోందని, 2022 నాటికి 175 గిగావాట్ల క్లీన్ ఎనర్జీ ఉత్పాదకతను దేశం లక్ష్యంగా పెట్టుకుందన్న విషయం మీకు తెలియక పోవడం తమ దురదృష్టం అంటూ చెప్పుకొచ్చారు.