గుంటూరు: రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం పెద్ద స్కామ్ అని వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అనడం విడ్డూరంగా ఉందన్నారు మాజీమంత్రి నారా లోకేష్. సీఎం జగన్ వ్యాఖ్యలతో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతోందని విమర్శించారు. రాజధాని రైతులకు అన్యాయం జరిగితే చూస్తు ఊరుకోమని హెచ్చరించారు.  

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీయులు మెుగ్గు చూపరని స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమంటూ వ్యాఖ్యానించారు నారా లోకేష్. అయితే స్థానిక సంస్థల కోసం ప్రణాళికతో ముందుకు వెళ్తామని తెలిపారు. 

ప్రతీరోజు మంగళగిరి ప్రజలకు తాను అందుబాటులోనే ఉంటానని నారా లోకేష్ స్పష్టం చేశారు. మరోవైపు చంద్రబాబు నాయుడు కుటుంబం ప్రస్తుతం ఎక్కడైతే ఉండవల్లిలో నివాసం ఉంటుందో అక్కడే ఉంటుందని తేల్చి చెప్పారు.  చంద్రబాబు నాయుడు నివాసానికి గతంలోనే పంచాయితీ అనుమతి ఉందని తేల్చి చెప్పారు. 

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఓటమిపాలైనా బలమైన కేడర్ ఉందన్నారు. ఒకరిద్దరు టీడీపీ వీడినంత మాత్రాన పార్టీకి ఎలాంటి నష్టం ఉండబోదన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడులకు పాల్పడితే చూస్తు ఊరుకోబోమని హెచ్చరించారు మంత్రి నారా లోకేష్. 

మరోవైపు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను తమ పార్టీలోకి రావాలంటూ వేధింపులకు పాల్పడుతోందంటూ మండిపడ్డారు. పార్టీమారనని తెగేసి చెప్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వైసీపీ నేతలు హింసిస్తున్నారంటూ ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు.  

టీడీపీ కార్యకర్త వైసీపీలో చేరనని చెప్పినందుకు అతనిని ఎలా హింసిస్తున్నారో చూడండి జగన్ అంటూ ఒక ఆడియోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. టీడీపీ నేత భార్యను ప్రస్తావిస్తూ మీ వైసీపీ నేతలు వాడిన భాష ఎంత జుగుప్సాకరంగా ఉందో విని సిగ్గుపడండి. ఇదీ మీ రాజన్నరాజ్యంలో జరుగుతున్న రాక్షస పర్వం అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.