అమరావతి: మాజీ సీఎం, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుపై మాజీ మంత్రి, బీజేపీ నేత మాణిక్యాలరావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. జన్మభూమి కమిటీల పేరుతో చంద్రబాబు తన పార్టీ నేతలకు లబ్ధి చేకూర్చే ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. 

చంద్రబాబు పాలనలో అవినీతి తాండవం చేసిందని ఆరోపించారు. అభివృద్ధి ఎక్కడా కనిపించలేదని విమర్శించారు. దేశ అభివృద్ధి కేవలం బీజేపీతోనే సాధ్యమన్నారు. బీజేపీ చేస్తున్న అభివృద్ధిని చూసే దేశవ్యాప్తంగా పలువురు పార్టీలో చేరుతున్నారని తెలిపారు. 

వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై బీజేపీ పోరాటం చేస్తుందని తెలిపారు. గ్రామ వాలంటీర్ల నియామకంతో రేషన్ డీలర్లలో అయోమయం నెలకొందన్నారు. ఇసుకపై ప్రభుత్వ పాలసీని సీఎం జగన్ తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేశారు. 

మరోవైపు గోదావరి జలాల విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైయస్ జగన్ సఖ్యతను స్వాగతిస్తున్నామని అన్నారు. అయితే ఇరు రాష్ట్రాలకు నష్టం జరగకుండా నిర్ణయాలు తీసుకోవాలని మాజీమంత్రి మాణిక్యాలరావు సూచించారు.