వైసీపీ ప్రభుత్వానికి దమ్ముంటే ఎన్నికలు నిర్వహించాలని సవాల్ విసిరారు టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. మచిలీపట్నంలో శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన ఎన్నికలు పెడితే తెలుగుదేశం సత్తా ఏంటో చూపిస్తామన్నారు.

బందరు మండలంలోని 25 పంచాయతీలకు ఎన్నికలు జరపాలని కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు. మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేసేందుకు గతంలో గెజిట్ విడుదల చేసిన 9 పంచాయతీలను కార్పొరేషన్ లో విలీనం చేయాలని ఆయన కోరారు.

మిగిలిన 25 పంచాయతీలకు రిజర్వేషన్లు ప్రకటించి ఎన్నికలు జరపాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లామని... కార్పొరేషన్‌లో తమకు అనుకూలంగా డివిజన్ పరిధులను అధికార వైసీపీ నిర్ణయించిందని కొల్లు ఆరోపించారు.

ఓటర్ల జాబితాలోనూ తీవ్ర వ్యత్యాసాలు ఉన్నాయని... వీటిని కూడా సరి చేయాలని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లామని రవీంద్ర వెల్లడించారు. దీనిపై వెంటనే జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి సమాచారం తెప్పించుకుని న్యాయం చేస్తాము అని ఆయన చెప్పారు.

వైసీపీ అరాచకాలకు ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలుసునని... ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగానే వున్నారని రవీంద్ర స్పష్టం చేశారు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత చూసి ఏదో రకంగా ఎన్నికలు ఆపించాలని ప్రభుత్వం శత విధాలుగా ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు.  

కానీ న్యాయస్థానం న్యాయం వైపే ఉంటుందని తమకు పూర్తి విశ్వాసం ఉందని రవీంద్ర అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి  తెచ్చుకుని ఎన్నికలకు సహకరిస్తే పరువు నిలుస్తుందని ఆయన హితవు పలికారు.

అధికారులు కూడా చట్టంపై గౌరవముంచి ఎన్నికలకు సహకరించాలని.. ప్రభుత్వం చెప్పినట్లు విని ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ తెచ్చి చరిత్రహీనులు గా మిగిలిపోవద్దని కొల్లు రవీంద్ర హితవు పలికారు.