జగన్‌ను ఓడించాలని రాజకీయ శక్తులన్నీ కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని. ఎలాంటి రిమార్క్ లేకుండా ఎన్నికలకు వెళ్తామని కొడాలి నాని స్పష్టం చేశారు.  

విపక్షాలపై మండిపడ్డారు మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... జగన్‌ను ఓడించాలని రాజకీయ శక్తులన్నీ కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. ఇంగ్లీష్ మీడియం విద్యపై ప్రతిపక్షాలవి పనికిమాలిన విమర్శలని.. ఎలాంటి రిమార్క్ లేకుండా ఎన్నికలకు వెళ్తామని కొడాలి నాని స్పష్టం చేశారు. వచ్చే నెలలో మచిలీపట్నం పోర్ట్ నిర్మాణ పనులను సీఎం జగన్ ప్రారంభిస్తారని ఆయన పేర్కొన్నారు. ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ.. జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామాల్లో ఇంటింటికీ తాగునీటి పైప్‌లైన్ వేస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో గుడివాడ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇకపోతే.. గత నెలల కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌కు ఆత్మాభిమానం కంటే ప్యాకేజీయే ముఖ్యమని ఎద్దేవా చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊడిగం చేసేందుకే జనసేన ఏర్పాటు చేశారంటూ కొడాలి నాని దుయ్యబట్టారు. పవన్ కల్యాణ్ తన చెప్పును జాగ్రత్తగా వుంచుకుని, వచ్చే ఎన్నికల్లో కౌంటింగ్ రోజున అదే చెప్పుతో కొట్టుకోవాలని.. అలాగే ఆయన స్థితికి కారణమైన చంద్రబాబును కూడా అదే చెప్పుతో కొట్టాలంటూ నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

ALso REad:ఆ చెప్పు జాగ్రత్తగా దాచుకో.. నువ్వు కొట్టుకుని, చంద్రబాబును కూడా కొట్టు : పవన్‌‌కు కొడాలి నాని కౌంటర్

సిగ్గు లేకుండా కన్నతల్లిని తిట్టిన వారితోనే పవన్ కలిసి నడుస్తున్నాడంటూ ఆయన మండిపడ్డారు. ముందు బ్రహ్మానందం డైలాగులు వదిలి సక్రమమైన మార్గంలో వెళ్లాలని నాని చురకలంటించారు. పవన్ కళ్యాణ్‌కు కాపు సామాజిక వర్గం, ప్రజలు ముఖ్యం కాదని, కేవలం జగన్‌ను గద్దె దించడమే ప్రధానమని ఆయన మండిపడ్డారు. 100 మంది పవన్ కల్యాణ్‌లు వచ్చినా జగన్ చిటికెన వేలు కూడా కదల్చలేరని కొడాలి నాని జోస్యం చెప్పారు. ఉత్తరాంధ్ర జేఏసీ నిర్వహించిన విశాఖ గర్జన నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికే పవన్‌ను చంద్రబాబు విశాఖకు పంపారని ఆయన ఆరోపించారు. ఉద్దేశ్యపూర్వకంగానే విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో మంత్రులపై దాడి జరిగిందని నాని అన్నారు. ప్రొడ్యూసర్లకు ఇచ్చినట్లు పవన్ కల్యాణ్ రాజకీయ కాల్షీట్లు ఇస్తున్నాడని.. చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేయడం పవన్ లక్ష్యమని కొడాలి నాని ఆరోపించారు.