Asianet News TeluguAsianet News Telugu

ఆ చెప్పు జాగ్రత్తగా దాచుకో.. నువ్వు కొట్టుకుని, చంద్రబాబును కూడా కొట్టు : పవన్‌‌కు కొడాలి నాని కౌంటర్

వైసీపీ నేతలను చెప్పుతో కొడతానంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊడిగం చేసేందుకే జనసేన ఏర్పాటు చేశారంటూ ఆయన ఎద్దేవా చేశారు. 
 

ex minister kodali nani counter to janasena chief pawan kalyan over his comments on ysrcp leaders
Author
First Published Oct 20, 2022, 8:01 PM IST

వైసీపీ నేతలను చెప్పుతో కొడతానంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నాని ఘాటుగా స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌కు ఆత్మాభిమానం కంటే ప్యాకేజీయే ముఖ్యమని ఎద్దేవా చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊడిగం చేసేందుకే జనసేన ఏర్పాటు చేశారంటూ కొడాలి నాని దుయ్యబట్టారు. పవన్ కల్యాణ్ తన చెప్పును జాగ్రత్తగా వుంచుకుని, వచ్చే ఎన్నికల్లో కౌంటింగ్ రోజున అదే చెప్పుతో కొట్టుకోవాలని.. అలాగే ఆయన స్థితికి కారణమైన చంద్రబాబును కూడా అదే చెప్పుతో కొట్టాలంటూ నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

సిగ్గు లేకుండా కన్నతల్లిని తిట్టిన వారితోనే పవన్ కలిసి నడుస్తున్నాడంటూ ఆయన మండిపడ్డారు. ముందు బ్రహ్మానందం డైలాగులు వదిలి సక్రమమైన మార్గంలో వెళ్లాలని నాని చురకలంటించారు. పవన్ కళ్యాణ్‌కు కాపు సామాజిక వర్గం, ప్రజలు ముఖ్యం కాదని, కేవలం జగన్‌ను గద్దె దించడమే ప్రధానమని ఆయన మండిపడ్డారు. 100 మంది పవన్ కల్యాణ్‌లు వచ్చినా జగన్ చిటికెన వేలు కూడా కదల్చలేరని కొడాలి నాని జోస్యం చెప్పారు. ఉత్తరాంధ్ర జేఏసీ నిర్వహించిన విశాఖ గర్జన నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికే పవన్‌ను చంద్రబాబు విశాఖకు పంపారని ఆయన ఆరోపించారు. ఉద్దేశ్యపూర్వకంగానే విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో మంత్రులపై దాడి జరిగిందని నాని అన్నారు. ప్రొడ్యూసర్లకు ఇచ్చినట్లు పవన్ కల్యాణ్ రాజకీయ కాల్షీట్లు ఇస్తున్నాడని.. చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేయడం పవన్ లక్ష్యమని కొడాలి నాని ఆరోపించారు. 

ALso REad:మూడు పెళ్లిళ్లతోనే మేలని చెబుతున్నారు, ఒక్క జగన్‌ను కొట్టడానికి ఇంతమంది ఏకం: వైఎస్ జగన్ 

అంతకుముందు వైసీపీ నేతలపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ఏపీ సీఎం జగన్ కౌంటర్ ఇచ్చారు. ప్రజలకు ఏం చేయనివారు, చెప్పుకోవడానికి ఏం లేనివారే బూతులు తిడుతున్నారని విమర్శించారు. వీధి రౌడీలు కూడా అలాంటి మాటల మాట్లాడరేమోనని అన్నారు. చెప్పులు చూపిస్తూ దారుణమైన మాటలు మాట్లాడుతుంటే వీళ్లేనా మన నాయకులు అని బాధ అనిపిస్తోంది. దత్త పుత్రుడితో దత్త తండ్రి ఏం మాట్లాడిస్తున్నామో కూడా చూస్తున్నామని అన్నారు. అవనిగడ్డ ప్రభుత్వ కాలేజ్‌లో నిర్వహించిన రైతుల క్లియరెన్స్ పత్రాల కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. మూడు రాజధానుల వల్ల అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందుతాయని చెబితే.. కాదు మూడు పెళ్లిళ్ల వల్లే మేలు జరుగుతుందని అంటున్నారని ఎద్దేవా చేశారు. వీరు కూడా చేసుకోండి అని ఏకంగా టీవీల్లోనే చెబుతున్నారని విమర్శించారు. ‘‘ఇలా మాట్లాడితే మన ఇంట్లో ఆడవాళ్ల పరిస్థితేమిటి..? కూతుళ్ల పరిస్థితేమిటి..?, చెల్లమ్మల పరిస్థితేమిటి..? అనేది ఆలోచన చేయాలి. ఇలా ప్రతి ఒక్కరు కూడా నాలుగేళ్లు, ఐదేళ్లు కాపురం చేసి.. ఎంతో కొంత ఇచ్చి విడాకులు ఇచ్చేసి మళ్లీ పెళ్లిచేసుకోవడం మొదలు పెడితే.. ఒకసారి కాదు, రెండు సార్లు, మూడు సార్లు, నాలుగు సార్లు చేసుకోవడం మొదలు పెడితే.. మీరు చేసుకోండి అని చెబుతూ పోతే.. వ్యవస్థ ఏం బుతుకుతుంది. ఆడవాళ్ళ మాన ప్రాణాలు ఏం  కావాలి?.. అక్కాచెల్లెమ్మల జీవితాలు ఏం  కావాలి?.. ఇలాంటి వాళ్ల మనకు నాయకులు అని ఒక్కసారి ఆలోచన చేయండి’’ అని సీఎం జగన్ అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios