రాజకీయాల్లో గొడవలు కామన్... మాచర్ల హింసపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
పల్నాడు జిల్లా మాచర్లలో శుక్రవారం టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య చోటు చేసుకున్న పరిస్థితులపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో గొడవలు సర్వసాధారణమన్నారు.

పల్నాడు జిల్లా మాచర్లలో శుక్రవారం చోటు చేసుకున్న హింసాత్మక పరిస్ధితులపై స్పందించారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని. రాజకీయాల్లో గొడవలు ఇదే తొలిసారి కాదని.. చివరిసారి కూడా కాదన్నారు. 75 ఏళ్ల వయసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బట్టలూడదీసి కొడతానని రోజూ అంటున్నారని నాని దుయ్యబట్టారు. ఆయన మాట్లాడిన మాటలను మాచర్లలో టీడీపీ నేతలు ఆదర్శంగా తీసుకుని వుంటారని కొడాలి నాని చురకలంటించారు.
కాగా... మాచర్లలో టీడీపీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. శుక్రవారం సాయంత్రం మాచర్ల రింగ్ రోడ్ నుంచి మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న స్కూల్ వరకు ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని తలపెట్టారు. దీనికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ క్రమంలోనే వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ మొదలయ్యింది.
ALso REad:మాచర్ల హింస ... నిందితుల గుర్తింపు, పోలీసుల వైఫల్యం లేదు : పల్నాడు ఎస్పీ
దీంతో వైసీపీ, టీడీపీ శ్రేణులు రాళ్లు, కర్రలతో దాడి చేసుకున్నాయి. దాడిలో పలువురికి గాయాలు, ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలానికి చేరుకుని ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. దాడి చేసినవారిపై కేసు నమోదు చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఉద్రిక్తతల నేపథ్యంలో టీడీపీ ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని పోలీసులు నిలిపివేశారు.టీడీపీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూలకంటి బ్రహ్మారెడ్డిని మాచర్ల పోలీసులు గుంటూరు తరలించారు.
వైసీపీ కార్యకర్తల దాడుల్లో మాచర్ల మంటల్లో చిక్కుకుంది. మూడు గంటలకు పైగా ఈ దాడుల ఘటనలు కొనసాగాయి. టీడీపీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డి ఇల్లు, పార్టీ కార్యాలయం, వాహనాలు తగలబెట్టారు. ఇరువర్గాల కార్యకర్తలు శుక్రవారం సాయంత్రం బాహాబాహీకి దిగారు. దింతో మొదలైన గొడవలు రాత్రికి పెచ్చుమీరిపోయాయి. రాళ్లు, కర్రలతో ప్రతీకార దాడులుగా మారాయి.