Asianet News TeluguAsianet News Telugu

మూడు పెళ్లిళ్లతోనే మేలని చెబుతున్నారు, ఒక్క జగన్‌ను కొట్టడానికి ఇంతమంది ఏకం: వైఎస్ జగన్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ఏపీ సీఎం జగన్ కౌంటర్ ఇచ్చారు. ప్రజలకు ఏం చేయనివారు, చెప్పుకోవడానికి ఏం లేనివారే బూతులు తిడుతున్నారని విమర్శించారు. వీధి రౌడీలు కూడా అలాంటి మాటల మాట్లాడరేమోనని అన్నారు.

CM YS Jagan Counter To Pawan Kalyan Comments
Author
First Published Oct 20, 2022, 12:56 PM IST

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ఏపీ సీఎం జగన్ కౌంటర్ ఇచ్చారు. ప్రజలకు ఏం చేయనివారు, చెప్పుకోవడానికి ఏం లేనివారే బూతులు తిడుతున్నారని విమర్శించారు. వీధి రౌడీలు కూడా అలాంటి మాటల మాట్లాడరేమోనని అన్నారు. చెప్పులు చూపిస్తూ దారుణమైన మాటలు మాట్లాడుతుంటే వీళ్లేనా మన నాయకులు అని బాధ అనిపిస్తోంది. దత్త పుత్రుడితో దత్త తండ్రి ఏం మాట్లాడిస్తున్నామో కూడా చూస్తున్నామని అన్నారు. అవనిగడ్డ ప్రభుత్వ కాలేజ్‌లో నిర్వహించిన రైతుల క్లియరెన్స్ పత్రాల కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. మూడు రాజధానుల వల్ల అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందుతాయని చెబితే.. కాదు మూడు పెళ్లిళ్ల వల్లే మేలు జరుగుతుందని అంటున్నారని ఎద్దేవా చేశారు. వీరు కూడా చేసుకోండి అని ఏకంగా టీవీల్లోనే చెబుతున్నారని విమర్శించారు. ‘‘ఇలా మాట్లాడితే మన ఇంట్లో ఆడవాళ్ల పరిస్థితేమిటి..? కూతుళ్ల పరిస్థితేమిటి..?, చెల్లమ్మల పరిస్థితేమిటి..? అనేది ఆలోచన చేయాలి. ఇలా ప్రతి ఒక్కరు కూడా నాలుగేళ్లు, ఐదేళ్లు కాపురం చేసి.. ఎంతో కొంత ఇచ్చి విడాకులు ఇచ్చేసి మళ్లీ పెళ్లిచేసుకోవడం మొదలు పెడితే.. ఒకసారి కాదు, రెండు సార్లు, మూడు సార్లు, నాలుగు సార్లు చేసుకోవడం మొదలు పెడితే.. మీరు చేసుకోండి అని చెబుతూ పోతే.. వ్యవస్థ ఏం బుతుకుతుంది. ఆడవాళ్ళ మాన ప్రాణాలు ఏం  కావాలి?.. అక్కాచెల్లెమ్మల జీవితాలు ఏం  కావాలి?.. ఇలాంటి వాళ్ల మనకు నాయకులు అని ఒక్కసారి ఆలోచన చేయండి’’ అని సీఎం జగన్ అన్నారు. 

ఇలాంటి వాళ్లు మనకు దశ-దిశ చూపగలరా అనేది ఆలోచించాలని అన్నారు. అక్కడ ఉన్నది అందరూ వెన్నుపోటుదారులేనని విమర్శించారు. ఇలాంటి వారు కలిసి కూటములు కట్టి జగన్‌పై యుద్దం చేస్తారంటా అని అన్నారు. ఒక్క జగన్‌ను కొట్టడానికి ఇంతమంది ఏకమవుతున్నారంటే.. ఆశ్చర్యం అనిపిస్తోందని చెప్పారు. 

వాళ్ల మాదిరిగా తను కుట్రలను, మీడియాను నమ్ముకోలేదని అన్నారు. తాను దేవుడిని నమ్ముకున్నానని.. అక్కాచెల్లెమ్మను నమ్ముకున్నానని చెప్పారు. ఈరోజు మంచికి , మోసానికి యుద్దం జరుగుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో కుట్రలు, కుతంత్రాలు మరింతగా  పెరుగుతాయని అన్నారు.  ఈ మోసాలు, కుట్రలను నమ్మొద్దని కోరారు. టీవీలను చూడొద్దని.. మీ ఇట్లో మంచి జరిగిందా? లేదా? అనేది చూడాలని అన్నారు. మంచి జరిగితే తనకు తోడుగా నిలవాలని చెప్పారు. 

ఇంకా ఆ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లైనా భూములకు కచ్చితమైన రికార్డులు లేవని అన్నారు. భూ యాజమాన్య హక్కులపై స్పష్టత లేకపోవడంతో అనేక సమస్యలు వస్తున్నాయని చెప్పారు. రికార్డుల్లో వివరాలు పక్కాగా లేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే భూములకు కచ్చితమైన రికార్డులు ఉండాలని ఆలోచన చేశామని చెప్పారు. ఆధునిక సాంకేతికతో భూములు రీసర్వే చేయిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం విమానాలు, హెలికాఫ్టర్లు, డ్రోన్లను ఉపయోగిస్తున్నామని చెప్పారు. రీసర్వే కోసం పెద్ద సంఖ్యలో సర్వేయర్లను రిక్రూట్ చేశామని తెలిపారు. 

భూములకు సరిహద్దులు చూపడంతో పాటు హక్కు పత్రాలు కూడా జారీచేస్తామని  చెప్పారు. నవంబర్‌లో 1,500‌కు పైగా గ్రామాల్లో సర్వే పూర్తిచేసి భూ హక్కు పత్రాలు అందజేస్తామని తెలిపారు. సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కూడా గ్రామాల్లోనే ఉండేలా అడుగులు వేస్తున్నామని చెప్పారు. 22 ఏ(1) కింద ఉన్న నిషేధిత భూముల సమస్యను పరిష్కరిస్తూ రైతులకు పట్టాలు ఇవ్వనున్నట్టుగా తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 35,669 ఎకరాల భూ సమస్యలకు పరిష్కారం చూపనున్నట్టుగా తెలిపారు.నిషేధిత జాబితా నుంచి డీనోటిఫై చేస్తూ కలెక్టర్లకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని వెల్లడించారు.   వచ్చే ఏడాది చివరికంతా 17 వేల గ్రామాల్లో సర్వే పూర్తవుతుందని చెప్పారు. 


దేశానికి ఆదర్శంగా ఉండేలా రిజిస్ట్రేషన్, రికార్డుల నిర్వహణ చేపడుతున్నట్టుగా తెలిపారు. తమ ప్రభుత్వం పాలనకు, గత ప్రభుత్వ పాలనకు తేడా గమనించాలని కోరారు. ప్రతి ఇంటికి అభివృద్ది ఫలాలు అందిస్తున్నామని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios