తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన క్యాసినో వ్యవహారంలో టీడీపీ నేతలకు సవాల్ విసిరారు మాజీ మంత్రి కొడాలి నాని. దమ్ముంటే తనను ఈడీతో అరెస్ట్ చేయించాలని ఆయన సవాల్ విసిరారు.
క్యాసినో వ్యవహారంలో టీడీపీ నేతలకు వైసీపీ ఎమ్మెల్యే , మాజీ మంత్రి కొడాలి నాని సవాల్ విసిరారు. దమ్ముంటే ఈడీతో తనను అరెస్ట్ చేయించాలని ఆయన సవాల్ విసిరారు. చికోటి వ్యవహారాన్ని తమపై ఆపాదించడం సరికాదన్నారు. క్యాసినోపై టీటీపీ నిజ నిర్ధారణ కమిటీ నివేదిక ఈడీకి ఇవ్వాలని నాని డిమాండ్ చేశారు. దేశంలో ఏం జరిగినా జగన్‌కు ముడిపెడుతున్నారని కొడాలి నాని మండిపడ్డారు.
ఇకపోతే.. క్యాసినో నిర్వహాకుడు చికోటి ప్రవీణ్ కుమార్‌కు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బుధవారం ప్రవీణ్‌తో పాటు మాధవరెడ్డి తదితర ఏజెంట్లపై ఈడీ ఎనిమిది చోట్ల సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో పలు కీలక ఆధారాలు కూడా సేకరించింది. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా)ను ఉల్లంఘనలపై దృష్టి సారించిన ఈడీ.. హవాలా లావాదేవీలకు సంబంధించి విచారణ సాగిస్తుంది. అయితే క్యాసినో వెనకాల చికోటి ప్రవీణ్ పెద్ద దందానే సాగించినట్టుగా తెలుస్తోంది.
Also REad:చికోటి ప్రవీణ్ కస్టమర్ల లిస్టులో ఎమ్మెల్యేలు.. సినీ సెలబ్రిటీలతో ప్రమోషన్ వీడియోలు..!
అతని బిగ్ షాట్స్‌తో పరిచయాలు ఉన్నాయని.. కొన్ని తెలుగు చానల్స్ కథనాలు ప్రసారం చేశాయి. ఆ కథనాల ప్రకారం.. చికోటి ప్రవీణ్‌కు దాదాపు 200 మంది కస్టమర్లు ఉన్నారు. ఆ కస్టమర్ల లిస్టులో కొందరు ఎమ్మెల్యేల, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నట్టుగా తెలుస్తోంది. నేపాల్‌కు వెళ్లిన కస్టమర్లలో 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రవీణ్.. చెన్నై బంగారం వ్యాపారికి హవాలా ఏజెంట్‌గా ఉన్నాడు. చికోటి ప్రవీణ్ చేతిలోనే నలుగురు వాహలా ఆపరేటర్లు ఉన్నారు. బేగంబజార్, బోయిన్‌పల్లి, సరూర్ నగర్, జగదీష్ మార్కెట్ కేంద్రంగా వాహలా దందా సాగించాడు. ఇండోనేషియా, శ్రీలంక, నేపాల్, దుబాయ్‌లలో చికోటి ప్రవీణ్ క్యాసినో దందాలు నిర్వహించేవాడు. కస్టమర్ల నుంచి ఒక్కో దేశానికి ఒక్కో రేటు వసూలు చేస్తున్నాడు.
ప్యాకేజీలో.. ప్రతి జూదగాడు విమాన ఛార్జీలు, ఆహారం, హోటల్ బస, పానీయాలు, వినోదం కోసం రూ. 3 లక్షలకు పైగా చెల్లించాల్సి ఉంటుంది. ఇక, కొన్ని సందర్బాల్లో అతడు ప్రత్యేక విమానాలు కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. మరోవైపు టాలీవుడ్‌తో పాటు ఇతర సినీ పరిశ్రమలకు చెందిన సెకండ్ గ్రేడ్ హీరోయిన్లతో ప్రవీణ్‌కు పరిచయాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. పలువురు సినీ సెలబ్రిటీలతో క్యాసినోకు సంబంధించిన ప్రమోషన్ వీడియోలు చేయించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో కొందరు సినీ సెలబ్రిటీలను అతడు నేపాల్‌కు కూడా తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే సినీ సెలబ్రిటీలకు ప్రవీణ్ చేసిన చెల్లింపులు, వారి మధ్య ఆర్థిక లావాదేవీలపై కూడా ఈడీ అధికారులు ఆరా తీస్తున్నట్టుగా సమాచారం.
