గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు  కళా వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాసంకల్ప పాదయాత్రలో ప్రతిపక్ష నేతగా వైయస్ జగన్ ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

గుంటూరులో పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన అసెంబ్లీలో టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడంపై మండిపడ్డారు. ప్రజల పక్షాన అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తే సస్పెండ్ చేస్తారా అంటూ నిలదీశారు. సభను నడపాల్సింది స్పీకర్‌ అని సీఎం కాదంటూ సెటైర్లు వేశారు.  

పాదయాత్రలో 45 సంవత్సరాలు దాటిని ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్కచెల్లెమ్మలకు రూ.2000 పింఛన్ ఇస్తామని చెప్పి ఇప్పుడు ఇవ్వలేదని చెప్తారా అంటూ నిలదీశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు చెప్పిందొకటి.. ఇప్పుడు చేస్తోందొకటని విమర్శించారు.  

అసెంబ్లీలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్లబొల్లి మాటలు చెప్తోందని ఘాటుగా విమర్శించారు. టీడీపీపై బురదజల్లడమే జగన్‌ పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. జగన్‌లో రోజురోజుకు అసహనం పెరిగిపోతోందని మండిపడ్డారు. 

అలాగే ప్రజల తరుపున అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తారా అంటూ ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవలంభిస్తున్న విధానాలను తాము ఖండిస్తున్నట్లు కళా వెంకట్రావు స్పష్టం చేశారు.