విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ఓటమిపై తెలుగుదేశం పార్టీ పోస్టుమార్టం నిర్వహించింది. ఓటమిపై విశ్లేషిస్తోంది. అయితే  రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా కులాల ప్రస్తావన వచ్చిందని దాని వల్లే దెబ్బతిన్నామా అన్న సందేహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి. 

టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో టీడీఎల్పీ భేటీకి హాజరైన గోరంట్ల  ఓటమికి కారణాలను విశ్లేషిస్తున్నట్లు తెలిపారు. పార్టీ ఓటమిపై ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు. టెక్నాలజీ కొంపముంచిందా..?

 లేక నేల విడిచి సాము చేశామా..? అనే విషయంలో తాము విశ్లేషించుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. తాను గతంలోనే పార్టీ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశానని కానీ అప్పుడు తన మాటలు పట్టించుకోలేదన్నారు. 

ఇకపోతే వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న తరుణంలో మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నివాసానికి వచ్చి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. జగన్ ప్రమాణ స్వీకారానికి హాజరుకావాలా..? వద్దా అనే అంశంపై టీడీఎల్పీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అభిప్రాయపడ్డారు.