ఏపీలో ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ పరిస్థితి దారుణంగా మారిపోయింది. చాలా మంది నేతలు పార్టీని వీడటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రత్యామ్నాయంగా కొందరు వైసీపీని ఎంచుకుంటుంటే... మరికొందరు ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో స్ట్రాంగ్ గా తయారౌతున్న బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు బీజేపీని ఆశ్రయించగా... తాజాగా మరో నేత ఆ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

దివంగత నేత భూమా నాగిరెడ్డి అన్న కుమారుడు, మాజీ మంత్రి అఖిలప్రియ సోదరుడు భూమా కిశోర్ రెడ్డి బీజేపీలో చేరడానికి రెడీ అయ్యారు. ఇప్పటికే భూమా కిశోర్ రెడ్డి హైదరాబాద్ లోని బీజేపీ నేతలతో మంతనాలు చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో భూమా కిశోర్ రెడ్డి నంద్యాలలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన భూమా బ్రహ్మానందరెడ్డి విజయానికి కృషి చేశారు.

మాజీ ఎంపీపీ భూమా కిశోర్‌రెడ్డి దివంగత భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డిఅడుగు జాడల్లో నడిచి ప్రతి ఎన్నికల్లో వారి విజయానికి కృషి చేసేవారు. భూమా దంపతులు ఏ పార్టీలో ఉన్నా తాను ఒక కార్యకర్తగా పనిచేశారు. 2004లో జరిగిన మండల ప్రాదేశిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగాపోటిచేసి గెలుపొందారు. ఈయనను ఎంపీపీ పదవి వరించింది. ఈయన పాలనలో ఆళ్లగడ్డ మండలాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశారు. కాగా... ఆళ్లగడ్డలో భూమా వర్గాన్ని కాపాడుకోవడానికే తాను బీజేపీలో చేరుతున్నట్లు ఆయన చెప్పినట్లు సమాచారం.