విశాఖపట్నంలో టీడీపీ కి మరో ఊహించని షాక్ తగిలింది. టీడీపీ సీనియర్ నేత ఒకరు పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారు. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి సోదరుడు సన్యాసి పాత్రుడు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. త్వరలోనే ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ నేతలతో సన్యాసి పాత్రుడు సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.

సన్యాసి పాత్రుడిని పార్టీలో చేర్చుకునేందుకు వైసీపీ శ్రేణులు కూడా ఉత్సాహం చూపిస్తున్నట్లు తెలుస్తోంది. సోదరుడు అయ్యన్న పాత్రుడు టీడీపీలో ఉన్నప్పటికీ తాను మాత్రం వైసీపీలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆయన మద్దతు దారులుకూడా పార్టీ మారడమే సరైన నిర్ణయమని చెప్పినట్లు తెలుస్తోంది. కాగా.. విశాఖ జిల్లా టీడీపీలో సన్యాసిపాత్రుడు కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఈయన పార్టీ మారడం జిల్లాలో టీడీపీకి పెద్ద దెబ్బ అనే చెప్పాలి. మరి దీనిపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. బుజ్జగింపులు జరిపితే సన్యాసి పాత్రుడు వెనక్కి తగ్గుతారేమో చూడాలి.