ఎన్టీఆర్ వారసుల నుంచి టీడీపీని లాక్కొనేందుకే లోకేష్ పాదయాత్ర చేస్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. లోకేష్ ముందు ఎమ్మెల్యేగా గెలవాలని, శాసనసభ్యుడిగా ఓడిపోయినవాడు పాదయాత్ర చేయడం ఏంటని కొడాలి నాని ప్రశ్నించారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రపై ఘాటు వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏ అర్హతతో లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడని దుయ్యబట్టారు. లోకేష్ ముందు ఎమ్మెల్యేగా గెలవాలని చురకలంటించారు. శాసనసభ్యుడిగా ఓడిపోయినవాడు పాదయాత్ర చేయడం ఏంటని కొడాలి నాని ప్రశ్నించారు. ప్రతిపక్షనేతగా వుండి పాదయాత్ర చేయాలని.. లోకేష్ పాదయాత్ర టీడీపీకే ఉపయోగం లేదని నాని వ్యాఖ్యానించారు. టీడీపీలో వారసత్వం కోసమే లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడని ఆయన ఆరోపించారు. టీడీపీ ఎన్టీఆర్ రక్తంతో పుట్టిన పార్టీ అని.. ఎన్టీఆర్ వారసుల నుంచి లాక్కొనేందుకే పాదయాత్ర చేస్తున్నారని కొడాలి నాని వ్యాఖ్యానించారు.
అంతకుముందు నారా లోకేష్ పాదయాత్రపై సెటైర్లు వేశారు మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. 'ఎలుక తోలు తెచ్చి 400 రోజులు ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు రాదు. గావంచ కట్టినోడల్లా గాంధీ కాలేడు. పాదయాత్ర చేసినోడల్లా నాయకుడూ కాలేడు' అని ట్వీట్ చేశారు. పవన్ కల్యాణ్‌పైనా మంత్రి మండిపడ్డారు. 'పవిత్రమైన దీపారాధనతో సిగరెట్టు ముట్టించుకునే వాడని స్వర్గంలో ఉన్న తన తండ్రినే అవమాన పరిచే పుత్రుడు సమాజానికి అవసరమా?' అని పవన్‌పై విమర్శలు చేశారు.
ALso REad: ఎలుక తోలు తెచ్చి 400 రోజులు ఉతికినా.. నారా లోకేష్ పాదయాత్రపై అంబటి సెటైర్లు
కాగా.. నారా లోకేష్ యువగళం పాదయాత్రపై స్పందించారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లోకేష్‌ది పాదయాత్ర కాదని, స్మశానయాత్ర అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దానిని ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే యాత్రగా భావిస్తున్నానని డిప్యూటీ సీఎం అన్నారు. పాదయాత్ర చేసి సమస్యలు పరిష్కరించాలి కానీ.. శిలాఫలాకాలను ధ్వంసం చేస్తున్నారని నారాయణ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇకపోతే.. నారా లోకేష్ టార్గెట్‌గా సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత, తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి . మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వార్డ్ మెంబర్‌గా కూడా గెలవలేని వ్యక్తి పాదయాత్ర చేస్తున్నాడంటూ చురకలంటించారు. ఫైబర్ నెట్ స్కాంలో దోపిడీకి పాల్పడ్డవాడు నీతిమంతుడిగా ప్రజల ముందుకు వస్తున్నాడని ఆమె ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి పెడితే ఆ యువ నాయకుడు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు.
