అమరావతి: డిజిటల్ మహానాడు కొనసాగుతుండగానే తెలుగుదేశం పార్టీ పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీ నాయకులు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ దాసరి రాజా మాస్టారు టీడీపీకి గుడ్ బై చెప్పారు. ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశ్యంతో పార్టీని వీడుతున్నట్లు రాజా ప్రకటించారు. రాజా మాస్టర్ తో పాటు మరికొందరు టిడిపి నాయకులు కూడా రాజీనామా చేశారు.  

రాజీనామా ప్రకటన అనంతరం రాజా మాస్టారు మాట్లాడుతూ... 32 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డానని అన్నారు. టీడీపీ పార్టీ అధికారం కోల్పోయిన తరువాత రెండో మహానాడు కార్యక్రమం జరిగిందన్నారు. ఈ రెండో విడత మహానాడు మీటింగ్ లో చంద్రబాబు నాయుడు మారతారేమోనని చూసానని.. కానీ ఆయనలో మార్పు రాలేదన్నారు. 

''అవకాశాలు ఇస్తాను అని చెప్పి ఇవ్వకపోయినా నేను ఎప్పుడు బాధపడలేదు. పార్టీలో కష్టపడి పని చేసే వారికి సముచిత స్థానం కల్పించడంలో చంద్రబాబు విఫలమయ్యారు. ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపడుతోంది'' అని పేర్కొన్నారు. 

read more  పార్టీపై చంద్రబాబు దృష్టి పెడితే జగన్ ఉండేవారు కాదు: సోమిరెడ్డి సంచలనం

''అధికారంలో ఉన్న లేకపోయినా ప్రజలకు సేవ చేయాలి. పదవి కోసం పార్టీలు మారే వ్యక్తిత్వం నాది కాదు... రాజకీయాలు ప్రజలకు సేవ చేసేలా ఉండాలి. రెండు మూడు పత్రికలను చేతిలో పెట్టుకొని చంద్రబాబు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. పార్టీలో పనిచేసే వ్యక్తులకు సరైన స్థానం కల్పించకపోవడం వల్లే పార్టీకి చాలా మంది దూరం అవుతున్నారు. పార్టీలోని వ్యక్తులనే చంద్రబాబు మోసం చేస్తున్నారు... ఇంకా ఎంత కాలం మోసం చేస్తారు'' అని రాజా మాస్టారు ప్రశ్నించారు. 

''ఏ రాజకీయ పార్టీ నాయకుడు అయిన కులాలకు మతాలకు తావు లేకుండా పని చెయ్యాలి. పార్టీ లో ఉండి ఆర్ధికంగా చాలా దెబ్బ తిన్నాను. కరోనe సమయంలో కూడా పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలు చాలా మంది చనిపోయారు. చనిపోయిన కార్యకర్తలకు పార్టీ తరుపున ఎటువంటి సహాయం చెయ్యలేదు'' అని రాజా మాస్టారు ఆవేధన వ్యక్తం చేశారు.