నెల్లూరు: తనపై వస్తున్న వార్తలను చదివి ఎంజాయ్ చేస్తున్నట్లు సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ చెప్పారు. తన వెనక ఏ పార్టీ ఉందో, తానో సామాజిక వర్గం కోసం అంటూ వస్తున్న వార్తలను పత్రికల్లో చూసి ఎంజాయ్ చేస్తున్నానని అన్నారు. తన పర్యటనలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ వార్తలు రాస్తున్నారని అన్నారు.

సమాజంలో అన్యాయం జరిగినప్పుడు అడిగే వారు లేరా ప్రశ్నించే వారు అలా ప్రశ్నించడానికి ఎవరైనా ముందుకు వస్తే విమర్శలు చేస్తున్నారని అన్నారు. ప్రతి వ్యక్తి తాను తయారు చేసిన వస్తువుకు తానే ధర నిర్ణయిస్తారని,  రైతు తన పంటకు తాను ధర నిర్ణయించుకోలేని పరిస్థితి ఈ దేశంలో ఉందని అన్నారు. దేహం- దేవుడు మధ్య దేశం ఉంటుందన్న విషయం గ్రహించాలన్నారు.

మార్పు మన నుంచే ప్రారంభం కావాలని ఆయన అన్నారు. శుక్రవారం ఆయన కావలిలో పట్టణ ప్రముఖులు, విద్యావేత్తలు, ప్రజా సంఘాలు, మహిళలు, యువతతో సమావేశమయ్యారు. తనకు చిన్ననాటి నుంచి దేశంపై ప్రేమ ఉండేదని రైతులపై మమకారం ఉండేదని చెప్పారు.
 
అందుకే ఏళ్ల సర్వీసు వదులుకుని దేశానికి వెన్నెముక లాంటి రైతుల అభివృద్ధికి కృషి చేయాలనే ఉద్దేశంతో తాను పర్యటనలు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని అన్నారు.