అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఘాటు వ్యాఖ్యలు చేశారు. పెద్దాపురం నియోజకవర్గం అభివృద్ధిలో వేలిపెడితే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. 

పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయినవాళ్లు నియోజకవర్గ రాజకీయాల్లో వేలిపెడితే సహించేది లేదని హెచ్చరించారు. పెద్దాపురం నియోజకవర్గం అభివృద్ధికి తాను ఎంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. 

ఇకపోతే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి చెందారు మాజీ ఎంపీ తోట నరసింహం భార్య తోట వాణి. ఇటీవలే సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించారు. ఈ నేపథ్యంలో ఆమెపై చినరాజప్ప ఘాటు వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. 

ఇకపోతే సీఎం వైయస్ జగన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు చినరాజప్ప. తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన 23 మందిపై జగన్ చేస్తున్న వ్యాఖ్యలు సరికాదన్నారు. ప్రతీసారి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు దేవుడు తీర్పు అంటూ చంద్రబాబును పదేపదే అనడం సరికాదని ఇకనైనా జగన్ తన వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు.